మూసీ బ్యూటిఫికేషన్ కాదు.. లూటిఫికేషన్: కేటీఆర్
కాంగ్రెస్ పార్టీ చేపట్టింది మూసీ బ్యూటిఫికేషన్ కాదని, లూటిఫికేషన్ అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు.
By అంజి Published on 3 Oct 2024 7:28 AM GMTమూసీ బ్యూటిఫికేషన్ కాదు.. లూటిఫికేషన్: కేటీఆర్
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ చేపట్టింది మూసీ బ్యూటిఫికేషన్ కాదని, లూటిఫికేషన్ అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు. మూసీ రివర్ ఫ్రంట్ సుందరీకరణ ప్రాజెక్టు సింగిల్ ఎజెండాతో మళ్లీ ఎన్నికలకు పిలుపునివ్వాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి కేటీఆర్ సవాల్ విసిరారు. ''నమామి గంగ ప్రాజెక్టుకు ఒక్కో కిలోమీటర్‌కు రూ.17 కోట్లు ఖర్చు చేస్తున్నారు. కానీ మూసీ సుందరీకరణకు ఒక్కో కిలోమీటర్‌కు రూ.2,700 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఇదెక్కడి వింత? ఈ స్కామ్ నిధులు మొత్తం కాంగ్రెస్ రిజర్వ్ బ్యాంకులోకే వెళ్తున్నాయి'' అని ఆయన ట్వీట్ చేశారు.
''కాంగ్రెస్ ప్రభుత్వం నిజంగా మూసీ సుందరీకరణ చాలా ముఖ్యమైనదని విశ్వసిస్తే, వారు ఈ ప్రభుత్వాన్ని రద్దు చేసి, మూసీ సుందరీకరణ అనే ఒకే ఎజెండాతో ఎన్నికలకు వెళ్లాలి. డజన్ల కొద్దీ ఉచిత పథకాలు ఇస్తాం అంటే గెలిచారు. ముందుగా ఆ హామీలను అమలు చేయండి'' అని ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్‌ను కేటీఆర్ రీ ట్వీట్ చేస్తూ.. మళ్లీ ఎన్నికలకు పిలుపునివ్వాలని రాహుల్ గాంధీకి సవాల్ చేశారు.
కష్టపడి పస్తులుండి పైసా పైసా కూడేసి - బ్యాంకు నుండి అప్పు తెచ్చి కట్టిన గుడును కూల్చుతారని భయంతో ప్రజల ప్రాణాలు పోతున్నాయని కేటీఆర్ ట్వీట్ చేశారు. 16 కాదు 18 మంది అయినా సరే ఒకే ఇంట్లో ఉమ్మడిగా ఉన్న కుటుంబాలను రోడ్డుకు ఈడ్చి కుటుంబాల్లో చిచ్చులు పెట్టిన వ్యక్తి రేవంత్ రెడ్డి అని కేటీఆర్ ఆరోపించారు. ఇండ్లు ఖాళీ చేస్తే డబుల్ బెడ్ రూమ్ తో పాటు 25 వేల పారితోషకం అంటూ అధికారుల వెకిలి ఆఫర్లు ఇస్తున్నారంటూ కేటీఆర్ మండిపడ్డారు. కోటి ఆశలతో లక్షలు-కోట్లు వెచ్చించి కట్టుకున్న ఇండ్లకు రూ.25 వేలా? అని కేటీఆర్ ప్రశ్నించారు.