తెలంగాణలో ఎండల తీవ్రత కొనసాగుతున్న నేపథ్యంలో వాతావరణ శాఖ తాజా హెచ్చరికలు జారీ చేసింది. నేడు రాష్ట్రంలోని ఆదిలాబాద్, నిజామాబాద్, నిర్మల్ వంటి ఉత్తర జిల్లాలతో పాటు భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ, ములుగు, జగిత్యాల, మంచిర్యాల, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 40°C నుండి 42°C వరకు నమోదయ్యే అవకాశం ఉంది.
హైదరాబాద్ మరియు దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు 38°C నుండి 40°C మధ్య ఉండవచ్చు. ఎండల తీవ్రత దృష్ట్యా మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు బయటకు వెళ్లవద్దని నిపుణులు సూచిస్తున్నారు. మరోవైపు, ఉపరితల ఆవర్తన ప్రభావంతో రేపు, ఎల్లుండి రాష్ట్రంలోని 19 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది.
ముఖ్యంగా సాయంత్రం లేదా రాత్రి సమయాల్లో గంటకు 40-50 కి.మీ వేగంతో వీచే ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ వర్షాల వల్ల ఎండల నుండి తాత్కాలిక ఉపశమనం లభించినప్పటికీ, పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.