ఆదిలాబాద్ ఇంజనీరింగ్ విద్యార్థికి అంతర్జాతీయ అవార్డు

టర్కీలోని ఇస్తాంబుల్‌లో ఆగస్టు 24 నుండి 30 వరకు యునిసెఫ్ నిర్వహించిన గ్లోబల్ ఇంక్యుబేషన్ వీక్‌లో ఆదిలాబాద్ పట్టణానికి చెందిన ఇంజనీరింగ్ విద్యార్థి, అలియన్ ఇన్నోవేషన్స్ వ్యవస్థాపకుడు తగిరే రవికిరణ్ కనిపెట్టిన 'బ్లైండ్ ఐ' అనే పరికరానికి అవార్డు లభించింది.

By Medi Samrat  Published on  29 Aug 2024 8:17 PM IST
ఆదిలాబాద్ ఇంజనీరింగ్ విద్యార్థికి అంతర్జాతీయ అవార్డు

టర్కీలోని ఇస్తాంబుల్‌లో ఆగస్టు 24 నుండి 30 వరకు యునిసెఫ్ నిర్వహించిన గ్లోబల్ ఇంక్యుబేషన్ వీక్‌లో ఆదిలాబాద్ పట్టణానికి చెందిన ఇంజనీరింగ్ విద్యార్థి, అలియన్ ఇన్నోవేషన్స్ వ్యవస్థాపకుడు తగిరే రవికిరణ్ కనిపెట్టిన 'బ్లైండ్ ఐ' అనే పరికరానికి అవార్డు లభించింది. ఈ విప్లవాత్మకమైన పరికరం దృష్టిలోపం ఉన్న వ్యక్తుల కోసం తయారు చేశారు.

ఐదేళ్ల కిందట కాగజ్ నగర్ జవహర్ నవోదయ విద్యాలయంలో మరో విద్యార్థి​తో కలిసి ‘బ్లైండ్ ఐ’ పరికరం ప్రాజెక్టు చేపట్టాడు రవికిరణ్. ఏఐ టెక్నాలజీతో కళ్లజోడులాగా దీన్ని రవికిరణ్ రూపొందించాడు. అంధులు ఈ కళ్లజోడు పెట్టుకుని ఇంకొకరి సాయం లేకుండా నడవడంతో పాటు వారి పనులన్నీ చేసుకోవచ్చు. ఈ పరికరంలో ఏర్పాటు చేసిన సెన్సార్, చిప్​లు ఎదురుగా ఉన్న వస్తువుల గురించి అలర్ట్ లు ఇస్తాయి. ఇప్పటికే దీనిని ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్ స్టిట్యూట్​లో సైతం ప్రయోగాత్మకంగా పరిశీలించగా మంచి ఫలితాలు వచ్చాయి. ఈ పరికరం ధర రూ.8 వేల నుంచి 12 వేల వరకు ఉంటుందని పేర్కొన్నారు.

TGSRTC ఆదిలాబాద్ డిపో క్లర్క్ కుమారుడు తగిరే రవికిరణ్ ఇమాజెన్ వెంచర్ అవార్డును గెలుచుకున్నాడు. గ్లోబల్ ఇంక్యుబేషన్ వీక్‌లో తన ఆవిష్కరణను ప్రదర్శించడానికి UNICEF నుండి ఆహ్వానం పొందిన భారతదేశం నుండి మొదటి, ఏకైక ఆవిష్కర్త రవి. ఈవెంట్‌లో ఆలోచనను రేకెత్తించే ఉపయోగకరమైన పరిష్కారాలను ప్రదర్శించడానికి ప్రపంచవ్యాప్తంగా ఎంపిక చేసిన 10 మంది ఆవిష్కర్తలలో అతను కూడా ఒకడు. ఇమేజెన్ వెంచర్స్ అవార్డు కింద కిరణ్ రూ. 8.5 లక్షల నగదు బహుమతిని అందుకోబోతున్నాడు. అతని పరికరాన్ని 10 దేశాల్లో ట్రయల్ చేయడానికి కూడా అనుమతులు లభించాయి.

Next Story