హైదరాబాద్: రైతులకు త్వరలోనే మరో శుభవార్త వినిపించేందుకు సిద్ధమైంది రాష్ట్ర ప్రభుత్వం. సంక్రాంతి నుంచి రైతు భరోసా పథకం ప్రారంభించేందుకు చర్యలు చేపట్టినట్టు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. రైతు భరోసాపై శనివారం నాడు మంత్రి తుమ్మల సమీక్ష నిర్వహించారు. సాగు చేసే భూమికే పెట్టుబడి సాయం చేస్తామన్నారు. ప్రస్తుతం వ్యవసాయ అధికారులు రైతుల పేర్లు నమోదు చేస్తున్నారని తెలిపారు. సర్వే నంబర్ల వారీగా గ్రామాల్లో సాగు వివరాలు సేకరిస్తున్నామన్నారు. రిమోట్ సెన్సింగ్ డాటా ఆధారంగా సాగు విస్తీర్ణం గుర్తించడంపై పలు కంపెనీల ప్రతినిధులతో ఆయన భేటీ అయ్యారు.
''సాగు చేసే వ్యవసాయ భూమికే పెట్టుబడి సాయం ఇవ్వడం మా ఉద్దేశం. వ్యవసాయ శాఖ అధికారుల వద్ద రైతుల పేర్ల నమోదు జరుగుతోంది. స్కీమ్ అమలులో కచ్చితత్వం కోసం రిమోట్ సెన్సింగ్ డేటా వినియోగిస్తాం. గ్రామాలు, సర్వే నెంబర్ల వారీగా సాగు వివరాలు సేకరిస్తాం'' అని మంత్రి తుమ్మల తెలిపారు. గ్రామాల్లోని సర్వే నెంబర్ల వారిగా సాగులో ఉన్న భూముల విస్తీర్ణం, సాగుకు అనువుగా లేని విస్తీర్ణంతో పాటు ప్రస్తుతం ఏ పంట ఎంత విస్తీర్ణంలో సాగు అయిందనే మొత్తం వివరాలను పొందుపరచనున్నట్లు చెప్పారు. రైతుల వారీగా, పంటల వారీగా సాగు విస్తీర్ణంపై ఎప్పటికప్పుడు మండల స్థాయిలో వ్యవసాయ విస్తరణ అధికారులు సమాచారాన్ని సేకరిస్తారని మంత్రి తుమ్మల తెలిపారు.