టెలివిజన్ కార్మికులకు అండగా ఉంటాం: మంత్రి శ్రీధర్‌బాబు

టెలివిజన్ కార్మికుల సంక్షేమం, అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్పష్టం చేశారు.

By -  Knakam Karthik
Published on : 9 Nov 2025 5:00 PM IST

Hyderabad, Minister Sridhar Babu, television workers, Congress Government

టెలివిజన్ కార్మికులకు అండగా ఉంటాం: మంత్రి శ్రీధర్‌బాబు

హైదరాబాద్: టెలివిజన్ కార్మికుల సంక్షేమం, అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. వారికి అన్ని రకాలుగా అండగా ఉంటామని, సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారు. ఆదివారం బేగంపేట్ లోని హరిత ప్లాజా హోటల్ లో "తెలంగాణ టెలివిజన్ డెవలప్ మెంట్ ఫోరం" ఆధ్వర్యంలో నిర్వహించిన "కార్తీక మాస ఆత్మీయ సమ్మేళనం"కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ... రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు "ఎంటర్‌టైన్‌మెంట్ రంగం" కీలక చోదక శక్తిగా మారిందని, ప్రేక్షకులకు నిరంతరం వినోదాన్ని అందించేందుకు టెలివిజన్ కార్మికులు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. ఈ రంగంలో పనిచేసే ప్రతి ఒక్కరూ సమయం, సందర్భం లేకుండా ఎంతో కష్టపడతారని, వారి త్యాగం వెలకట్టలేనిదని కొనియాడారు. రాష్ట్రంలో టెలివిజన్ రంగం ఎదుర్కొంటున్న సవాళ్లు, ముఖ్యంగా కార్మికుల ఆర్థిక, సామాజిక భద్రతా సమస్యలపై తమ ప్రభుత్వానికి పూర్తి అవగాహన ఉందన్నారు. ఈ విషయంలో ఎలాంటి ఆందోళనకు గురి కావొద్దని, వారి పట్ల సీఎం రేవంత్ రెడ్డి అత్యంత సానుకూలంగా ఉన్నారని వివరించారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నాయకత్వంలో త్వరలోనే అన్ని సమస్యలు పరిష్కారమవుతాయని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, సంఘం ప్రతినిధులు సురేష్, కవిత తదితరులు పాల్గొన్నారు.

Next Story