హైదరాబాద్: అవసరమైతే తెలంగాణ కోసం చస్తా.. కానీ అవినీతి చేయనని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఏసీబీ ప్రశ్నలన్నింటీకి తన వద్ద సమాధానాలు ఉన్నాయని చెప్పారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడానికే పని చేశానని, ఒక్క పైసా అవినీతి చేయలేదని మరోసారి వెల్లడించారు. బామ్మర్దులకు కాంట్రాక్టులు ఇవ్వలేదని, ఎమ్మెల్యేలకు రూ.50 లక్షలు ఇస్తూ పట్టుబడలేదని సీఎంను ఉద్దేశించి కేటీఆర్ మాట్లాడారు. ఎన్ని కేసులు పెట్టినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నట్టు కేటీఆర్ తెలిపారు.
ఫార్ములా-ఈ రేసు కేసులో నేడు కేటీఆర్‌ను ఏసీబీ విచారించనుంది. ఈ క్రమంలోనే కేటీఆర్.. నందినగర్‌లోని తన నివాసం నుంచి ఏసీబీ విచారణకు బయల్దేరారు. కేటీఆర్‌తో పాటు లాయర్, మాజీ ఏఏజీ రామచందర్ రావు వెళ్తున్నారు. కాగా, విచారణ జరిగే గది పక్కనే ఉన్న లైబ్రరీ రూం వరకే లాయర్‌ను అనుమతించనున్నారు. కేటీఆర్ విచారణ దృష్ట్యా అప్రమత్తమైన పోలీసులు ఏసీబీ ఆఫీసు వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఐఏఎస్ దాన కిషోర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేటీఆర్‌ను విచారించనున్నారు.