మహంకాళి అమ్మవారి ఆలయ ప్రాంగణం అభివృద్ధి చేస్తాం: డిప్యూటీ సీఎం భట్టి
బోనాలు అంటే తెలంగాణ సంస్కృతి. ఈ సంస్కృతిని అనాదిగా ఆచరిస్తూ వస్తున్న భక్తులందరికీ శుభాకాంక్షలు..అని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.
By Knakam Karthik
మహంకాళి అమ్మవారి ఆలయ ప్రాంగణం అభివృద్ధి చేస్తాం: డిప్యూటీ సీఎం భట్టి
బోనాలు అంటే తెలంగాణ సంస్కృతి. ఈ సంస్కృతిని అనాదిగా ఆచరిస్తూ వస్తున్న భక్తులందరికీ శుభాకాంక్షలు..అని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. లాల్ దర్వాజా బోనాల ఉత్సవంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు పాల్గొన్నారు. అనంతరం డిప్యూటీ సీఎం మాట్లాడుతూ..'బోనాల ఉత్సవాలను పెద్ద ఎత్తున జరుపుకుంటున్న సంగతి మనకందరికీ తెలిసిందే. గోల్కొండలో మొదలయ్యే ఈ బోనాలు ఉత్సవాలు సికింద్రాబాద్ నుంచి లాల్ దర్వాజాలో వెలసియున్న సింహవాహిని మహంకాళి అమ్మవారి దగ్గర వరకు జరుగుతున్న ఈ ఉత్సవాలను జరుగుతున్నాయి. అత్యంత ప్రశాంతంగా భక్తి ప్రపత్తులతో నగరంలో ఈ ఉత్సవాలు కొనసాగడం ఆనందదాయకం. ఈ రాష్ట్రంలోని దేవాలయాల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం 1,290 కోట్ల నిధులను కామన్ గుడ్ ఫండ్ నుంచి విడుదల చేయడం జరిగింది. హైదరాబాద్ మహానగరంలో జరిగేటువంటి బోనాల ఉత్సవాల కోసం 20 కోట్ల రూపాయల నిధులను ప్రత్యేకంగా విడుదల చేయడం జరిగింది. ఎవరికి ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉద్యోగులు, సిబ్బంది, అత్యంత జాగరూకతతో వ్యవహరిస్తున్నారు. ఈ బోనాల ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీగా నిర్వహిస్తోంది..అని భట్టి పేర్కొన్నారు.
ఉత్సవాలు అత్యంత ప్రశాంత వాతావరణంలో జరగడానికి సహకరిస్తున్న భక్తులకు సిబ్బందికి ఉద్యోగులకు అభినందనలు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈరోజు అమ్మవారికి పట్టు వస్త్రములు సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలని క్షేమంగా సుభిక్షంగా చూడాలని, ఈ సమాజాన్ని, మీ భక్తులని, విశ్వ మానవాళిని నీ చల్లని చూపులతో చల్లగా చూడాలని రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారిని ప్రత్యేకంగా వేడుకోవడం జరిగింది. లాల్ దర్వాజాలో వెలసిన సింహ వాహిని మహంకాళి అమ్మవారి చల్లని చూపులతో రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి సాధించాలని రాష్ట్ర ప్రజలందరికీ తరఫున అమ్మవారిని కోరుకోవడం జరిగింది. ఈ ప్రాంతంలోని ఆలయాల అభివృద్ధి కోసం తగిన చర్యలు తీసుకుంటామని గతంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారన్న విషయాన్ని ఉపముఖ్యమంత్రి తెలిపారు. భవిష్యత్తులో మహంకాళి అమ్మవారి ఆలయం చుట్టూ ప్రాంగణాన్ని అభివృద్ధి చేస్తాం..అని డిప్యూటీ సీఎం భట్టి తెలిపారు.