ఎస్సీ వర్గీకరణలో లోపాలపై సూచనలు చేశాం: మంద కృష్ణ మాదిగ

ఎస్సీ వర్గీకరణ ఉద్యమానికి సీఎం రేవంత్ రెడ్డి మొదటి నుంచీ మద్దతు ఇస్తున్నారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు.

By Knakam Karthik  Published on  11 Feb 2025 3:46 PM IST
Telangana, CM Revanthreddy, Manda Krishna Madiga, Sc Classificaton

ఎస్సీ వర్గీకరణలో లోపాలపై సూచనలు చేశాం: మంద కృష్ణ మాదిగ

ఎస్సీ వర్గీకరణ ఉద్యమానికి సీఎం రేవంత్ రెడ్డి మొదటి నుంచీ మద్దతు ఇస్తున్నారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. హైదరాబాద్‌లోని సీఎం నివాసంలో మంద కృష్ణ మాదిగ రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అమలులో ఉప కులాల రిజర్వేషన్లకు సంబంధించి ప్రభుత్వం ఆమోదించిన నివేదికపై చర్చలో ఆయన పాల్గొని సీఎం రేవంత్‌కు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత వర్గీకరణను సీఎం రేవంత్ రెడ్డి ముందుకు తీసుకెళ్తున్నారని అన్నారు. ఎస్సీ వర్గీకరణపై చట్ట సభల్లో తీర్మానం చేసినందుకు గాను ఆయన ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఉప కులాల్లో రిజర్వేషన్ల శాతం, గ్రూపుల విషయంలో కొన్ని లోపాలు ఉన్నాయని ఆ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు మంద కృష్ణ మాదిగ చెప్పారు. అదే విధంగా కుల గణన లోపాలను సైతం సీఎంకు వివరించినట్లు చెప్పారు. ఉప కులాల్లో ఏ, బీ, సీ మాత్రమే చేశారని.. తాము నాలుగు గ్రూపులుగా చేయాలని ప్రభుత్వాన్ని అభ్యర్థించినట్లు మంద కృష్ణ అన్నారు.

రాజకీయ ప్రయోజనాలకు అతీతంగా మాదిగ, మాదిగ ఉప కులాలకు మేలు చేయాలనే మంచి లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ఉందని మంద కృష్ణతో భేటీ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అసెంబ్లీలో చర్చించి, కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసి, న్యాయ కమిషన్ వేసి, నివేదికలకు పరిగణనలోకి తీసుకున్న తర్వాతే నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు. దీని వల్ల ఎలాంటి న్యాయ పరమైన చిక్కులు లేకుండా చేశామని సీఎం రేవంత్ వివరించారు.

Next Story