మేం నెల నెలా ఆర్టీసీకి రూ.300 కోట్లు ఇస్తున్నాం: మంత్రి పొన్నం ప్రభాకర్
ఆర్టీసీ అంశాన్ని బీఆర్‌ఎస్ రాజకీయం చేస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. యూనియన్ల పేరుతో బీఆర్‌ఎస్ రాజకీయం చేస్తోందన్నారు.
By అంజి Published on 24 July 2024 11:33 AM ISTమేం నెల నెలా ఆర్టీసీకి రూ.300 కోట్లు ఇస్తున్నాం: మంత్రి పొన్నం ప్రభాకర్
ఆర్టీసీ అంశాన్ని బీఆర్‌ఎస్ రాజకీయం చేస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో మంత్రి పొన్నం మాట్లాడుతూ.. అధికారంలో ఉన్నప్పుడు యూనియన్లను రద్దు చేసిన బీఆర్‌ఎస్.. ఇప్పుడు పునరుద్ధరణ గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని అన్నారు. యూనియన్ల పేరుతో బీఆర్‌ఎస్ రాజకీయం చేస్తోందన్నారు. ఆర్టీసీ కార్మికులు 50 రోజులు సమ్మె చేసినా గతంలో పట్టించుకోలేదన్నారు. ఆర్టీసీ సొమ్మును గత ప్రభుత్వం వాడుకుందన్నారు. ఆర్టీసీకి తాము ప్రతి నెలా రూ.300 కోట్లు ఇస్తున్నామని, కొత్త బస్సులు కొంటున్నామని తెలిపారు. టీజీఎస్‌ఆర్టీసీలో 3,035 మంది ఉద్యోగులను నియమిస్తున్నామని తెలిపారు. పని భారం పెరిగినా ఆర్టీసీ కార్మికులు బాగా పని చేస్తున్నారని మంత్రి పొన్నం కొనియాడారు.
ఆర్టీసీ కార్మికుల సంక్షేమంపై కాంగ్రెస్ ఎన్నో హామీలు ఇచ్చిందని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. ఆర్టీసీ కార్మికులను పీఆర్‌సీ పరిధిలోకి తెస్తామన్నారని, ఆర్టీసీ విలీనంపై ఎప్పటిలోగా అపాయింట్‌మెంట్ డేట్ ప్రకటిస్తారని, కార్మికుల యూనియన్ పునరుద్ధరణ ఎప్పుడు చేస్తారని హరీశ్ రావు ప్రశ్నించారు. దీనికిపై విధంగా మంత్రి పొన్నం సమాధానం ఇచ్చారు.
అసెంబ్లీ వేదికగా ఆర్టీసీ విషయంలో కాంగ్రెస్ మేనిఫెస్టో చూపిస్తూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు అడిగిన ప్రశ్నకు మంత్రి శ్రీధర్ బాబు స్పందించారు. కాంగ్రెస్ మేనిఫేస్టోను బీఆర్‌ఎస్ నాయకులు బట్టీ పట్టినందుకు చాలా సంతోషమన్నారు. వెంటనే ఆ పక్కనే కూర్చొని ఉన్న సీఎం రేవంత్ పాస్ మార్కులు వేశారా? లేదా? అని సరదాగా అడగ్గా.. ఈ విషయంలో బీఆర్‌ఎస్ తాము పాస్ మార్కులు వేశామని శ్రీధర్ బాబు నవ్వుతూ సమాధానం ఇచ్చారు.