వరంగల్ ఎయిర్‌పోర్టుకు లైన్ క్లియర్?
వరంగల్ నగరంలోని మామునూరు ఎయిర్‌పోర్టు నిర్మాణానికి అడ్డంకులు తొలగుతున్నాయి.
By అంజి Published on 25 Oct 2024 9:15 AM ISTవరంగల్ ఎయిర్‌పోర్టుకు లైన్ క్లియర్?
వరంగల్ నగరంలోని మామునూరు ఎయిర్‌పోర్టు నిర్మాణానికి అడ్డంకులు తొలగుతున్నాయి. శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు 150 కిలోమీటర్ల పరిధిలో 2038 వరకూ వాణిజ్య ఎయిర్‌పోర్టు ఏర్పాటు చేయవద్దనే రూల్‌ను పక్కన పెట్టేందుకు జీఎంఆర్ సంస్థ అంగీకరించినట్టు తెలుస్తోంది. దీంతో త్వరలో పనులు పట్టాలెక్కనున్నాయి. మొత్తం 950 ఎకరాల భూమి అవసరమని అధికారులు అంచనా వేస్తున్నారు. 696 ఎకరాల భూమి ఏఏఐ పరిధిలో అందుబాటులో ఉండగా, మరో 253 ఎకరాల భూమి సేకరించాల్సి ఉంది.
మామునూరులో 1930లో నిజాం హయాంలోనే ఎయిర్‌పోర్ట్ ఏర్పాటు చేశారు. పలు కారణాలతో 1980లో అది మూతపడింది. ఆ తర్వాత 2007లో కేంద్రం తీసుకొచ్చిన రీజినల్ కనెక్టివిటీ పథకం కింద తెలంగాణలో ఆరు కొత్త ఎయిర్‌పోర్టుల ఏర్పాటుతోపాటు, మామునూరు ఎయిర్‌పోర్టును డెవలప్ చేయాలని అప్పటి ప్రభుత్వం ఎంవోయూ కుదుర్చుకుంది.
అయితే వరంగల్ ఎయిర్‌పోర్టు అభివృద్ధికి నోచుకోలేదు. ఈ క్రమంలోనే ప్రస్తుత ప్రభుత్వం రాష్ట్రంలో కొత్త ఎయిర్‌పోర్టుల ఏర్పాటు, ఇప్పటికే ఉన్న వాటి అభివృద్ధిపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. అయితే మామునూరు విమానాశ్రయాన్ని పూర్తిస్థాయి ప్రయాణాలకు అనువుగా అందుబాటులోకి తీసుకురావాలంటే భూసేకరణ అంశంతోపాటు ఇతర సాంకేతిక సమస్యలు ఉన్నాయి.