రైతులను ఆదుకునేందుకే.. వరంగల్ డిక్లరేషన్ : రేవంత్ రెడ్డి
Warangal Declaration to help the farmers. రైతులను ఆదుకునేందుకు మొదటిసారిగా కాంగ్రెస్ మేనిఫెస్టోలో భాగంగా వరంగల్ డిక్లరేషన్ ప్రకటించిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు
By Medi Samrat Published on 12 March 2023 2:45 PM GMTTPCC President Revanth Reddy
రైతులను ఆదుకునేందుకు మొదటిసారిగా కాంగ్రెస్ మేనిఫెస్టోలో భాగంగా వరంగల్ డిక్లరేషన్ ప్రకటించిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. యాత్ర ఫర్ ఛేంజ్ పాదయాత్రలో నిజామాబాద్ పార్లమెంటు పరిధిలోని కమ్మర్ పల్లిలో రైతులతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వరంగల్ డిక్లరేషన్ అమలు చేయించే బాధ్యత తనదని రాహుల్ హామీ ఇచ్చారు అని ఆయన పేర్కొన్నారు. ఆర్మూర్ రైతుల ఆత్మగౌరవం అయిన కండువాను వేసుకుని రాహుల్ మాట ఇచ్చారు. రైతులకు రూ.2లక్షల రుణ మాఫీ చేస్తామని కాంగ్రెస్ డిక్లరేషన్ ఇచ్చింది. ఇందిరమ్మ రైతు భరోసా కింద భూమి లేని రైతులకు కూడా రూ.12వేలు అందిస్తాం. ప్రత్యేక పసుపు బోర్డు ఏర్పాటు చేస్తాం. చక్కెర ఫ్యాక్టరీని అధికారంలోకి వచ్చాక ఆరు నెలల్లో ఫ్యాక్టరీని తెరిపిస్తాం. రైతులకు రైతు బీమా పథకాన్ని కాంగ్రెస్ అమలు చేస్తుంది. రైతు ఆత్మగౌరవంతో బతికేలా పంటల బీమా పథకం అమలు చేస్తాం. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు నాటకాలాడి పంట బీమా అందించడంలేదు. పంట బీమా ఇవ్వని ప్రభుత్వం.. రైతు చనిపోతే బీమా ఇస్తామంతున్నారు. రైతు చావును కోరుకుంటున్న ప్రభుత్వ చర్య దుర్మార్గమైనది. మహిళా, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీ కమిషన్ లా.. రైతుల కోసం రైతు కమిషన్ ఏర్పాటు చేస్తాం. రైతు సమస్యలను రైతు కమిషన్ ద్వారా పరిష్కరిస్తాం. వరి వేస్తే ఉరి అని ప్రభుత్వం క్రాప్ హాలిడే ప్రకటిస్తోంది. ప్రభుత్వం వ్యవసాయాన్ని కార్పొరేట్ కు కట్టబెట్టే కుట్ర చేస్తోంది. రైతులను ఆదుకునేందుకు కాంగ్రెస్ స్పష్టమైన విధానంతో మీ ముందుకు వస్తోంది. మోడీ, అమిత్ షా దేశాన్ని అమ్మేస్తున్నారు. ఆదానీ, అంబానీ దేశాన్ని కొంటున్నారు. ఇద్దరు గుజరాతి పెట్టుబడిదారులకు దేశాన్ని అమ్ముతున్నారు. గుజరాత్ మోడల్ అంటే ఇదేనా? రాష్ట్రంలో 3వేల వైన్ షాపులు.. 6వేల బెల్టు షాపులున్నాయి. ఇదేనా కేసీఆర్ తెలంగాణ మోడల్..? పసుపు బోర్డు తెస్తానని బాండ్ పేపర్ ఇచ్చిన అరవింద్... మాట తప్పారు. పసుపు బోర్డు అడిగితే స్పైస్ బోర్డు తెచ్చినం అని చెబుతున్నారు. కేసీఆర్ పై కోపంతో బీజేపీ వైపు చూస్తే.. పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టే. 2014 నుంచి 2023 వరకు రైతులు ఎలా మోసపోయారో ఒకసారి ఆలోచించండి. ఆర్మూర్ రైతు దీక్ష నన్ను రాజకీయంగా ఒక మెట్టు ఎక్కేలా చేసింది. రైతులను ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. 2024, జనవరి 1వ కొత్త సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది. అధికారంలోకి రాగానే ప్రతీ పేదవాడికి ఇళ్లు కట్టుకునేందుకు రూ.5 లక్షలు అందిస్తాం. ఆరోగ్యశ్రీ ద్వారా రూ.5లక్షల వరకు వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుంది. పేదలకు రూ.500 లకే గ్యాస్ సిలిండర్ అందిస్తాం. ఏడాదిలోగా 2లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తాం. పంటలకు వరంగల్ డిక్లరేషన్ లో ప్రకటించిన విధంగా మద్దతు ధరకు కొనుగోలు చేస్తాం. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే చత్తీస్ ఘడ్ మోడల్ అమలు చేస్తాం. చత్తీస్ ఘడ్ లో వరి ధాన్యాన్ని రూ. 2660 కి ప్రభుత్వం కొంటోందని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.