టెన్త్ పేపర్ లీక్ కేసు.. ఏ1గా బండి సంజయ్
Warangal Cp Ranganath Talks On Bandi Sanjay Arrest. టెన్త్ హిందీ ప్రశ్నాపత్రం లీకు కేసులో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ను బుధవారం తెల్లవారుజామున
By Medi Samrat Published on 5 April 2023 6:10 PM ISTWarangal CP Ranganath
వరంగల్ సీపీ రంగనాథ్ మీడియాతో మాట్లాడుతూ పదో తరగతి ప్రశ్నపత్రాల లీకేజీ పక్కా ప్లాన్ ప్రకారమే జరిగిందని స్పష్టం చేశారు. పిల్లల సహాయంతో టెన్త్ ప్రశ్నపత్రాలు బయటకు తీసుకొచ్చి, కావాలనే వైరల్ చేస్తున్నారని సీపీ తెలిపారు. బండి సంజయ్‌ను కోర్టులో హాజరు పరిచిన అనంతరం సీపీ రంగనాథ్ మీడియాతో మాట్లాడారు. “ఏప్రిల్ 4వ తేదీన పరీక్ష ప్రారంభమైన 15 నిమిషాల తర్వాత ఉదయం 9.45 కి హిందీ ప్రశ్నపత్రం ఫోటో తీశారు. 11:18 గంటలకు మాజీ జర్నలిస్ట్ బూర ప్రశాంత్ ప్రశ్నపత్రాన్ని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో సహా అందరికీ పంపారు. లీకేజీ రోజున ఉదయం 11.30 గంటలకు బండి సంజయ్‌కి ప్రశాంత్ మెస్సేజ్ పంపాడని, ఆ తర్వాతనే బండి సంజయ్ మీడియాకు బ్రీఫింగ్ ఇచ్చారన్నారు. ఇందులో ప్రధానంగా లీకేజీల మీదనే మాట్లాడారని, తెలంగాణలో లీకేజీల జాతర అంటూ ప్రచారం చేశారన్నారు.
విచారణలో ప్రశాంత్, ఎంపీ బండి సంజయ్ మధ్య పలు వాట్సాప్ చాట్లు, కాల్‌లు చేసుకున్నట్లు కనుగొన్నారు. బండి సంజయ్ యొక్క ప్రెస్ స్టేట్‌మెంట్.. ఏప్రిల్ 3న జరిగిన వారి సంభాషణతో సరిపోలిందని తెలిపారు. ఏ2 ప్రశాంత్ గతంలో హెచ్‌ఎంటీవీలో బ్యూరో ఇన్‌చార్జిగా పని చేశాడని చెప్పారు. ప్రస్తుతం జర్నలిస్ట్ కాదని, నమో టీమ్ (నేషన్ విత్ నమో టీమ్)లో పని చేస్తున్నాడన్నారు. ఏబీఎం (అసోసియేషన్ ఫర్ బిలియన్ మైన్స్) ఆర్గనైజేషన్‌లో ఇది భాగమని, దీన్ని బీజేపీ పార్టీ మానిటరింగ్ చేస్తుందన్నారు. నమో టీమ్‌లో ప్రశాంత్ వరంగల్ పార్లమెంటరీ పార్టీ పరిధిలో బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడన్నారు. పేపర్లన్నీ కమలాపూర్ నుంచే ఎందుకు లీకవుతున్నాయనే కోణంలో విచారణ జరిపినట్లు తెలిపారు.కమలాపూర్ బాయ్స్ హైస్కూల్ ఏడు ఎకరాల్లోనే ఉంది అని సీపీ పేర్కొన్నారు. ఆ సెంటర్లో 250 పైన స్టూడెంట్స్ ఎగ్జామ్స్ రాస్తున్నారు. పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి. ఆ సెంటర్‌కు కాపలాగా ఒకరిద్దరు కానిస్టేబుల్స్‌ను మాత్రమే ఇవ్వగలుగుతామని అన్నారు.
పేపర్ లీకేజీ వ్యవహారంలో సంజయ్ పాత్ర లేకపోతే ఫోన్ దాచిపెట్టుకోవాల్సిన అవసరం ఏముంది..? ఆయన ఫోన్ ఇస్తే కీలక సమాచారం బయటకు వస్తుంది. ఫోన్ ఎందుకు తేలేదు..? ఆ ఫోన్ తెస్తే అంతా బయటపడుతుంది. నాకేం సంబంధం లేదు.. నన్ను అరెస్టు ఎలా చేస్తారు అని ఫోన్ ఇస్తే ఎవరు ఏంటనేది తేలిపోయేది కదా అని రంగనాథ్ ప్రశ్నించారు. గవర్నమెంట్‌ను అప్రతిష్టపాలు చేసే ప్రయత్నం జరిగింది అని సీపీ పేర్కొన్నారు. తమ వద్ద ఉన్న ఆధారాల మేరకు సంజయ్‌ను ఏ1గా చేర్చామని సీపీ స్పష్టం చేశారు.
హిందీ ప్రశ్నపత్రం లీక్ కేసులో ఏ1గా బండి సంజయ్, ఏ2గా భూర ప్రశాంత్, ఏ3గా మహేశ్, ఏ4గా మైనర్ బాలుడు, ఏ5గా మోతం శివగణేశ్, ఏ6గా పోరు సురేశ్, ఏ7గా పోరు శశాంక్, ఏ8గా దూలం శ్రీకాంత్, ఏ9 పెరుమాండ్ల శార్మిక్, ఏ10గా పాతబోయిన వసంత్ పేరును చేర్చామని సీపీ రంగనాథ్ తెలిపారు. రిమాండ్ రిపోర్టులో బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ వ్యక్తిగత సహాయకుడు కూడా ఉన్నారు, అయితే ఆయనపై ఎలాంటి కేసు నమోదు కాలేదు.
కమలాపూర్ పోలీసులు 9 మంది నిందితులపై ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 120(బి), 420, 447, 505 (1) (బి) మరియు T.S పబ్లిక్ ఎగ్జామినేషన్ (నివారణ) సెక్షన్ 4 (a), 6 r/w 8, అక్రమాస్తుల చట్టం -1997 కింద కేసు నమోదు చేశారు. కమలాపూర్ బాలుర పాఠశాల- ZPHS పాఠశాల ప్రధానోపాధ్యాయుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
ఈ ఘటనలపై విచారించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా, అధ్యక్షుడు జేపీ నడ్డా:
పేపర్ లీక్ కేసులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అరెస్ట్ అయిన నేపథ్యంలో కేంద్ర మంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా అరెస్ట్ స్థానిక బీజేపీ నేతలకు ఫోన్ చేశారు. కేసు వివరాలను పార్టీ నేతలను అడిగి తెలుసుకున్నారు. "వారు స్వయంగా నాకు ఫోన్ చేసి వివరాలు అడిగారు" అని మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు తెలిపారు.
న్యూస్‌మీటర్‌తో రామచంద్రరావు మాట్లాడుతూ, “జర్నలిస్టు నుండి మెసేజీ వచ్చినందుకు బండి సంజయ్‌ని ఎలా అరెస్టు చేస్తారు. రోజువారీ ప్రాతిపదికన, చాలా మంది రాజకీయ నాయకులు జర్నలిస్టులతో కాల్‌లు లేదా మెసేజీల ద్వారా సంప్రదిస్తూ ఉంటారు. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నప్పుడు బండి సంజయ్‌ను అక్రమంగా అరెస్టు చేయడాన్ని వ్యతిరేకిస్తూ మేము హార్బ్స్ కార్పస్ దాఖలు చేసాము. తెలంగాణ పోలీసులపై శిక్షార్హమైన చర్య తీసుకునే అవకాశం కూడా ఉంది." అని అన్నారు.