Warangal: మేడపైన గంజాయి మొక్కల పెంపకం.. వ్యక్తి అరెస్ట్

తన అవసరాల కోసం ఒక అడుగు ముందుకేసి తన ఇంటి మేడపైన గంజాయి మొక్కల పెంపకాన్ని ప్రారంభించి చివరికి పోలీసులకు చిక్కి కటాకటాలు పాలయ్యాడో వ్యక్తి.

By అంజి  Published on  8 Nov 2024 11:08 AM IST
Warangal: మేడపైన గంజాయి మొక్కల పెంపకం.. వ్యక్తి అరెస్ట్

Warangal, arrest, marijuana plants 

తన అవసరాల కోసం ఒక అడుగు ముందుకేసి తన ఇంటి మేడపైన గంజాయి మొక్కల పెంపకాన్ని ప్రారంభించి చివరికి పోలీసులకు చిక్కి కటాకటాలు పాలయ్యాడో వ్యక్తి. వివరాల్లోకి వెళితే వరంగల్ శివనగర్ ప్రాంతానికి చెందిన పల్లెబోయిన కుమార్ (60).. సులభం డబ్బు సంపాదనతో పాటు తన అవసరాలకోసం తన ఇంటి మేడపైనే పూల కుండీల్లో గంజాయి మొక్కల పెంపకం చేపట్టాడు. గురువారం రైల్వే స్టేషన్లో తనిఖీలు నిర్వహిస్తుండగా మత్తు పదార్థాలను పసిగట్టే పోలీస్ జాగిలం.. రైల్వే స్టేషన్‌కు సమీపంలో ఓ ఇంటి మేడపైన పెంచుతున్న గంజాయి మొక్కలను గుర్తించింది.

పల్లెబోయిన కుమార్‌ను అదుపులోకి తీసుకున్న డ్రగ్స్ కంట్రోల్ టీం, పోలీసులు మీల్స్ కాలనీ పోలీసులకు అప్పగించారు. గంజాయి మొక్కల్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు. వరంగల్‌ పోలీసు కమిషనరేట్‌కు మత్తు పదార్థాల వాసన చూసి గుర్తించే జాగిలాన్ని తీసుకొచ్చారు. సుమారు 100 మీటర్ల దూరంలో డ్రగ్స్‌ ఉన్నా గుర్తించడం దీని నైపుణ్యమని హ్యాండ్లర్ తెలిపారు.

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మత్తు పదార్థాల నియంత్రణలో భాగంగా వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆదేశాల మేరకు యాంటీ డ్రగ్స్ టీం, ఇంతేజార్ గంజ్ పోలీసుల ఆధ్వర్యంలో గురువారం వరంగల్ రైల్వే స్టేషన్ లో పోలీస్ జాగిలంతో ముమ్మర తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో భాగంగా పోలీసులు అనుమానస్పదంగా ప్రయాణికుల సామానుతో పాటు, బ్యాగ్ లను పోలీసులు పోలీస్ జాగిలంతో తనిఖీ చేయించారు.

ఈ సందర్బంగా యాంటీ డ్రగ్స్ టీం ఇంచార్జి ఇన్స్ స్పెక్టర్ సురేష్ ప్రయాణికులతో మాట్లాడుతూ.. ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు రహస్యంగా గంజాయి లాంటి మత్తు పదార్థాలను రవాణా చేస్తున్నా, విక్రయిస్తున్నా, వినియోగిస్తున్నా తక్షణమే 8712584473 సెల్ నంబర్ కు సమాచారం అందించాలని సూచించారు. సమాచారం అందించిన వారి వివరాలు గొప్యంగా ఉంచబడుతాయని తెలిపారు.

Next Story