మంత్రి కేటీఆర్‌ చిత్రపటానికి విశాఖలో పాలాభిషేకాలు

Vizag steel plant workers milk anointing to ktr photo.విశాఖపట్నంలో తెలంగాణమంత్రి కేటీఆర్ చిత్రపటానికి స్టీల్ ప్లాంట్

By తోట‌ వంశీ కుమార్‌
Published on : 11 March 2021 12:39 PM IST

Vizag steel plant workers milk anointing to ktr photo

విశాఖపట్నంలో తెలంగాణమంత్రి కేటీఆర్ చిత్రపటానికి స్టీల్ ప్లాంట్ కార్మికులు పాలాభిషేకం చేశారు. విశాఖ ఉక్కు ఉద్యమానికి సహకరిస్తామని, మద్దతిస్తామని మంత్రి కేటీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అవసరమైతే తాము విశాఖ వెళ్లి స్టీల్ ప్లాంట్ కార్మికులకు మద్దతు తెలుపుతామని చెప్పారు. తమ ఉద్యమానికి మద్దతు ప్రకటించిన కేటీఆర్ ఫొటోకు కార్మికులు పాలాభిషేకం చేశారు. తెలుగు రాష్ర్టాల ప్ర‌జ‌లంద‌రం క‌లిసి పోరాడి విశాఖ ఉక్కు క‌ర్మాగారం ప్రైవేటీక‌ర‌ణ‌ను అడ్డుకుంటామ‌ని కార్మికులు స్ప‌ష్టం చేశారు. తెలుగు వారి ఐక్య‌త వ‌ర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు.

మంత్రి కేటీఆర్ ఏమ‌న్నారంటే..?

విశాఖ ఉక్కు ప్రైవేట్ పరం కాకుండా ఏపీకి అండగా ఉంటామని మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు. అవసరమైతే విశాఖ వెళ్లి మద్దతు తెలుపుతామని వెల్లడించారు. ఏపీ వాళ్లు కూడా తెలంగాణకు మద్దతుగా ఉండాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వాలను కూడా మోదీ ప్రైవేట్‌పరం చేసేలా ఉన్నారని విమర్శించారు. బయ్యారంలో సెయిల్‌ ద్వారా ఉక్కు కర్మాగారం పెడతాం, వేలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. కానీ, విశాఖలో పోరాడి సాధించుకున్న ఉక్కు కర్మాగారాన్ని వంద శాతం అమ్మేసే ప్రయత్నం చేస్తున్నారు. కేంద్రం నిర్ణయంతో వేలాది మంది ఉక్కు ఉద్యోగులు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్నారు.

"ఉద్యోగులందరికీ అండగా నిలబడతాం. అవసరమైతే కేసీఆర్‌ ఆనుమతితో వైజాగ్‌ వెళ్లి ప్రత్యక్షంగా వారి పోరాటానికి మద్దతు తెలియజేస్తాం. ఎక్కడో విశాఖలో జరిగే ఉద్యమం.. మనకెందుకులే అనుకుంటే రేపు మన దగ్గరకు వస్తారు. ఇవాళ విశాఖ ఉక్కు అమ్ముతున్నారు.. రేపు బీహెచ్‌ఈఎల్‌ అమ్ముతారు, ఎల్లుండి సింగరేణి అమ్ముతారు. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు వీటిని కూడా ప్రైవేటు పరం చేయండి అంటారు. ఏమైనా చేస్తారు. ఉక్కు ఉద్యమానికి మద్దతిస్తాం.. తెలంగాణలో ప్రభుత్వ సంస్థలను అమ్మే ప్రయత్నం జరిగితే వారు కూడా మాతో కలిసిరావాలి'' అని కేటీఆర్‌ విజ్ఞప్తి చేశారు.


Next Story