తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ రాష్ట్ర సమితి ఓటమి పాలైన సంగతి తెలిసిందే!! ఇలాంటి సమయంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను చింతమడక గ్రామస్తులు బుధవారం కలిశారు. కేసీఆర్‌ను కలిసేందుకు 9 బస్సుల్లో 540 మంది ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ ఆయన స్వగ్రామమైన చింతమడక గ్రామస్తులకు అభివాదం చేశారు. జై కేసీఆర్.. కేసీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో హరీశ్‌రావుతో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.
తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమిపాలైన తర్వాత కేసీఆర్ ఎర్రవెల్లిలోని తన ఫామ్ హౌస్ కు వెళ్లిపోయారు. అప్పటి నుంచి ఆయన అక్కడి నుంచి బయటకు రాలేదు. ఇతర కార్యక్రమాల్లో పాల్గొనలేదు. ఎన్నికల్లో గెలుపొందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో ఆయన ఫామ్ హౌస్ లోనే సమావేశమయ్యారు. ఆ సమావేశానికి సంబంధించిన కొన్ని ఫోటోలు బయటకు వచ్చాయి.