ఇకనైనా అర్థం చేసుకుని ముందుకెళ్లండి : విజయశాంతి
Vijayashanti Fires On Govt. తెలంగాణలో విద్యాసంస్థల్ని తెరిచి ప్రత్యక్ష తరగతుల్ని నిర్వహించే విషయంలో మధ్యంతర
By Medi Samrat Published on 31 Aug 2021 6:12 PM ISTతెలంగాణలో విద్యాసంస్థల్ని తెరిచి ప్రత్యక్ష తరగతుల్ని నిర్వహించే విషయంలో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన సందర్భంగా వెలువడిన హైకోర్టు వ్యాఖ్యలపై రాష్ట్ర ప్రభుత్వం ఇకనైనా సానుకూల దృష్టితో ఆలోచించాలని బీజేపీ నాయకురాలు విజయశాంతి అన్నారు. కొవిడ్ తీవ్రత ఇంకా ఉందంటూ సెప్టెంబరు, అక్టోబరులో థర్డ్ వేవ్ పొంచి ఉందన్న హెచ్చరికలను న్యాయమూర్తులు గుర్తు చేశారన్నారు. గురుకులాలు, హాస్టళ్ళల్లో ప్రత్యక్ష బోధన వద్దని, హాస్టళ్ళను తెరవొద్దని, అక్కడి వసతులపై 4 వారాల్లో నివేదిక ఇవ్వాలని కోర్టు ఆదేశించిందని తెలిపారు. ఈ వసతుల విషయంలో గతంలోనే తాను స్పందించానని.. చాలా చోట్ల ఫర్నిచర్ పాడవడం, గోడలు-పైకప్పులు నానిపోవడం, తాగునీరు-మరుగుదొడ్ల సౌకర్యాలు లేకపోవడం, కొన్ని బడుల్లో కరెంట్ బిల్లులు కట్టకపోవడం వల్ల విద్యుత్ నిలిపివేత తదితర సమస్యల్ని ప్రస్తావించడం జరిగిందని వివరించారు.
ఉస్మానియా మాజీ డీన్ అధ్యయనంలో బయటపడిన ఈ అంశాలపై తెలంగాణ సర్కారు ఇప్పటికీ పూర్తిస్థాయిలో దృష్టి పెట్టలేదని ఫైర్ అయ్యారు. ఈ పరిస్థితుల మధ్య విద్యాసంస్థల్లో శానిటైజేషన్, భౌతికదూరం, మాస్కులు ధరించడం వంటి అతి ముఖ్యమైన చర్యలు సక్రమంగా అమలవుతాయా?.. అనే ఆందోళన విద్యావేత్తలు, వైద్యులు, తల్లిదండ్రుల్లో నెలకొందని.. ఇవన్నీ వీలైనంత త్వరలో పూర్తిగా సరిదిద్దాకే విద్యాసంస్థల్లో ప్రత్యక్ష బోధన ప్రారంభించే విషయమై ఆలోచన చెయ్యాలని అన్నారు. వసతులపై నివేదిక ఇవ్వాలన్న హైకోర్టు ఆదేశంలోని ఔచిత్యాన్ని పాలకులు ఇకనైనా అర్థం చేసుకుని ముందుకెళ్లాలని కోరారు. భావితరానికి చక్కని భవిష్యత్తు ఇవ్వాల్సిన సర్కారే ఆలోచనారాహిత్యంగా వ్యవహరించడం దురదృష్టకరమని విచారం వ్యక్తం చేశరు.