వరంగల్ అర్బన్ జిల్లాలో ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుని దాదాపు అర్ధగంట పాటు ఎటూ కదలనివ్వక చుక్కలు చూపించారని బీజేపీ నాయకురాలు విజయశాంతి అన్నారు. తమ ఉద్యోగాల పేరులో మాత్రమే "ఉపాధి హామీ" ఉంది తప్ప.. విధులకు తమను దూరం పెట్టి పగ సాధిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ తీరుతో కరోనా కష్టకాలంలో పనిలేక, జీతం రాక తమ కుటుంబాలు రోడ్డున పడ్డాయని రోదిస్తూ శాపనార్థాలు పెట్టారని ఆమె అన్నారు.
బంగారు తెలంగాణ ఇదేనా? అని ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు మంత్రిపై మండిపడ్డారని ఆమె పేర్కొన్నారు. పిల్లలకు సరైన తిండి కూడా పెట్టలేకపోతున్నామని మహిళా ఫీల్డ్ అసిస్టెంట్లు మీడియా ముందు తీవ్ర వేదనకు గురయ్యారని.. తన కళ్ళముందే ఇంత జరుగుతున్నా వారి సమస్యను తాను పరిశీలిస్తానని గాని, సీఎం దృష్టికి తీసుకెళతానని గాని కనీస హామీ ఇచ్చేందుకు కూడా ఆ మంత్రిగారు ధైర్యం చెయ్యలేని దుస్థితి కనిపించిందని ఎద్దేవా చేశారు.
రాష్ట్రంలో అధికార పార్టీ నేతల కుటుంబాలు తప్ప.. ఒక్క వర్గం కూడా సంతృప్తిగా బతుకుతున్న దాఖలా లేదని విజయశాంతి అన్నారు. పంటల కొనుగోళ్ళు లేక రైతులు.. ఉద్యోగాల్లేక ఆత్మహత్యల బాటలో నిరుద్యోగులు.. ఇలా తెలంగాణలో ఎటు చూసినా ఏమున్నది గర్వకారణం అనే పరిస్థితి నెలకొందని పైర్ అయ్యారు. అధికార పార్టీని ఎప్పుడెప్పుడు గద్దె దించాలా.. అని ప్రజలు ఎదురు చూస్తున్నారనడంలో సందేహం లేదని విజయశాంతి అన్నారు.