పరిస్థితి దారుణంగా ఉంది.. ఆరోగ్య మంత్రిగా ఉన్న సీఎంకు ఇవేమీ ప‌ట్ట‌వు

Vijayashanti Fires On CM KCR. తెలంగాణలో డెంగీ, మలేరియా కేసులు పెరుగుతూ పలువురు బాలలు, యువత మృత్యువాత

By Medi Samrat  Published on  4 Sep 2021 1:59 PM GMT
పరిస్థితి దారుణంగా ఉంది.. ఆరోగ్య మంత్రిగా ఉన్న సీఎంకు ఇవేమీ ప‌ట్ట‌వు

తెలంగాణలో డెంగీ, మలేరియా కేసులు పెరుగుతూ పలువురు బాలలు, యువత మృత్యువాత పడినా రాష్ట్ర సర్కారు ఏమీ పట్టనట్టుగా వ్యవహరిస్తోందని బీజేపీ నాయ‌కురాలు విజ‌య‌శాంతి ఫైర్ అయ్యారు. ఈ ఒక్క ఏడాదిలోనే ఇంతవరకూ 2500కు పైగా డెంగీ కేసులు, 116 వరకూ మలేరియా కేసులు నమోదైనట్టు అధికారుల గణాంకాలు పేర్కొంటున్నాయని అన్నారు. రాష్ట్రంలో ఈ వారం రోజుల్లోనే 20కి పైగా డెంగీ బాధితులు మరణించినట్టు కూడా సమాచారం ఉండగా.. ఆరోగ్యశాఖ నివేదికలో మరణాల ప్రస్తావనే లేదని.. ఈ కేసులు, మరణాల విషయంలో ఆరోగ్యశాఖ లెక్కలకు, వైద్యుల లెక్కలకు పొంత‌న లేదని మండిప‌డ్డారు.

క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే వాస్తవ గణాంకాలు చాలా రెట్లు ఎక్కువని హెల్త్ వర్కర్లు, డాక్టర్ల ద్వారా తెలుస్తోందని అన్నారు. డెంగీ, మలేరియా వ్యాప్తికి దోమల బాధ ప్రధాన కారణం కాగా.. దోమల లార్వాపై ఆరోగ్యశాఖ అధికారులు నిర్వహించిన సర్వే ప్రకారం.. పలు జిల్లాల్లో నివాసాలు, వీధుల నుంచి సేకరించిన నీటిలో 30 నుంచి 58 శాతానికి పైగా లార్వా ఉన్నట్టు గుర్తించారని.. ఇది నిజంగా అత్యంత ప్రమాదకరమైన అంశమ‌ని పేర్కొన్నారు. పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే.. ఈ లార్వాను అంతమొందించేందుకు సర్కారు వైపు నుంచి చర్యలేవీ కనిపించడం లేదన్న ఆందోళన వ్యక్తమవుతోందని అన్నారు.

అసలే కోవిడ్ ప్రభావం, థర్డ్ వేవ్ హెచ్చరికలు మధ్య జనం బిక్కుబిక్కుమంటుంటే.. ఇప్పుడు భయపెడుతున్న డెంగీ, మలేరియాలను కట్టడి చేసేందుకు సర్కారు ఏం చేస్తోందో తెలియడం లేదని అన్నారు. లాక్ డౌన్ సమయంలో చేపట్టిన పిచికారీ, ఫాగింగ్ లాంటివి క్రమంగా తగ్గుముఖం పట్టాయని.. ఒక్క హైదరాబాదులోనే గత 10 రోజుల్లో 800 వరకూ డెంగీ కేసులు నమోదయ్యాయని.. ఈ కేసుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయని హెచ్చ‌రించారు.

దేశవ్యాప్తంగా ఒక సామాజిక సంస్థ నిర్వహించిన సర్వే ప్రకారం.. దోమల కట్టడి విషయంలో స్థానిక పాలకుల తీరు సంతృప్తిగా లేదని హైదరాబాదీయులు సైతం తేల్చి చెప్పారని అన్నారు. ప్రభుత్వం వెంటనే మేల్కొని తగిన చర్యలు తీసుకోకుంటే రాష్ట్రాన్ని మరో ఉపద్రవం వైపు నెట్టినట్టవుతుందని అన్నారు. ఆరోగ్యశాఖ మంత్రిగా కూడా ఉన్న సీఎం గారికి, ఎన్నికలు, ఓట్లు తప్ప ఇంకేమీ పట్టవు కాబట్టి.. ఈ పరిస్థితుల్లో అధికారులైనా కొంత దృష్టి పెడితే ప్రజలు బచాయిస్తారని సూచించారు.


Next Story