బతికుంటే ఆయ‌న కంట‌ కన్నీరు ఏరులై పారేది : విజ‌య‌శాంతి

Vijayashanti Fires On CM KCR. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జీవితాన్ని అంకితం చేసి, మలిదశ ఉద్యమానికి ప్రాణమై

By Medi Samrat  Published on  6 Aug 2021 1:48 PM GMT
బతికుంటే ఆయ‌న కంట‌ కన్నీరు ఏరులై పారేది : విజ‌య‌శాంతి

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జీవితాన్ని అంకితం చేసి, మలిదశ ఉద్యమానికి ప్రాణమై నిలిచిన జయశంకర్ సార్ బతికుంటే.. తెలంగాణలో నేడున్న పరిస్థితి చూసి ఇందుకేనా రాష్ట్రాన్ని సాధించుకుందని ఆయన కంట కన్నీరు ఏరులై పారేదని బీజేపీ నాయ‌కురాలు విజ‌య‌శాంతి అన్నారు. మన భూమి, మన ఉద్యోగాలు, మన నీరు మనకే కావాలని ఎందరో ఉద్యమకారులు కుటుంబాల్ని పణంగా పెట్టి బలిదానాలతో అమరులయ్యారని ఆమె అన్నారు.

అమ‌రుల‌ ఆశయాలకు ఈ సర్కారు ఏ కాస్తయినా విలువనిచ్చిందా? అని ప్ర‌శ్నించారు. మన నీరు దోపిడీకి గురవుతుంటే తెలంగాణ సర్కారు చోద్యం చూస్తూ కూర్చుందని.. నకిలీ విత్తనాలు, ఎరువుల కొరతను ఎదుర్కొని అన్నదాతలు పంటలు పండిస్తుంటే.. మద్దతు ధర లేదు, కొనుగోలు కేంద్రాలు ఉండవు. చివరకు గతిలేక తమ పంటలకు తామే మంట పెట్టుకోవాల్సిన దుస్థితి నెల‌కొంద‌ని ఫైర్ అయ్యారు.

ఇక సర్కారు కొలువుల కోసం గత ఏడేళ్ళలో జరిగిన ఆత్మహత్యల గురించి తలుచుకుంటేనే కడుపు తరుక్కుపోతోందని.. లక్షల సంఖ్యలో ఖాళీలున్నా భర్తీ చెయ్యడానికి మీనమేషాలు లెక్కిస్తున్నారని విజ‌య‌శాంతి అన్నారు. ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడే నాటికి దేశంలోనే మనది ధనిక రాష్ట్రమని చెప్పి.. నేడు అప్పుల కుప్పగా మార్చేశారని అన్నారు. అభివృద్ధి పనులకు నిధులివ్వలేక.. పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించలేక అంతా అస్తవ్యస్తంగా మార్చేశారని వ్యాఖ్యానించారు.

రాష్ట్రంలోని నగరాల్ని డల్లాస్, ఇస్తాంబుల్, లండన్ లాగా ఇంకేవేవో చేసేస్తామన్నారని.. తీరా చూస్తే వాన చినుకు పడితే చాలు కాలనీలకు కాలనీలే నెలల తరబడి నీట మునిగే పరిస్థితి నెల‌కొంద‌ని విమ‌ర్శించారు. ఇక కోవిడ్ విషయానికొస్తే.. కార్పోరేట్ల దోపిడీని నిలువరించలేక ప్రజారోగ్యాన్ని అభద్రతలోకి నెట్టేశారని.. ఇదేనా జయశంకర్ సార్ కోరుకున్న తెలంగాణ?.. అని ప్ర‌శ్నించారు. ఇది అధికార పార్టీకి మాత్రమే బంగారు తెలంగాణ తప్ప, ప్రజలకు కాదని అన్నారు. సార్ మన మధ్య ఉంటే.. ఈ పాలకుల్ని గద్దె దించేందుకు కచ్చితంగా మరో ఉద్యమానికి ఊపిరులూదేవారని విజ‌య‌శాంతి అన్నారు.


Next Story
Share it