పల్లెలో జీవం తెచ్చింది వైఎస్సారే.. పార్టీ ఆవిష్కరణ సభలో భావోద్వేగానికి గురైన విజయమ్మ
Vijayamma Speech At YSRTP Party Launching. వైఎస్ షర్మిల నూతన పార్టీ ఆవిష్కరణ సభలో ప్రసంగిస్తూ వైఎస్ విజయమ్మ భావోద్వేగానికి
By Medi Samrat Published on 8 July 2021 12:51 PM GMTవైఎస్ షర్మిల నూతన పార్టీ ఆవిష్కరణ సభలో ప్రసంగిస్తూ వైఎస్ విజయమ్మ భావోద్వేగానికి గురయ్యారు. నాయకుడు అంటే వైస్సార్ ని చూసి నేర్చుకోవాలని అన్నారు. రాజశేఖర్ రెడ్డి అంటే ఎంత అభిమానం ఉందో.. ఈ రోజు మైకుల ముందు చెప్పలేకపోవచ్చు కానీ వారి గుండెల్లో ఉన్నాడని అన్నారు. కాంగ్రెస్ పార్టీ వారు వైఎస్‌పై ఈ రోజు ఎంతో కపట ప్రేమ చూపిస్తున్నారని.. రాజశేఖర్ రెడ్డిని దోషిగా ఎందుకు చూపించారు ? అని ప్రశ్నించారు. మమ్మల్ని రోడ్డుపైన పడేసిన మీరు.. వైస్సార్ ని ఈ రోజు భుజాలపై ఎత్తుకుంటున్నారని విజయమ్మ ఫైర్ అయ్యారు.
నాయకుడు అంటే భరోసా, ఒక ధైర్యం, నాయకుడు అంటే కొండను ఢీ కొట్టే దమ్ము, ధైర్యం, ప్రజల బ్రతుకు కోరే వారు నాయకుడు.. అంటే దానికి నిలువెత్తు నిదర్శనం వైస్సార్ అని అన్నారు. నాయకుడు అంటే సమస్యలు తెలుసుకుని పరిష్కరించడమే నాయకుడి లక్షణమని అన్నారు. తెలంగాణలో కాదు.. తెలుగు ప్రజల గుండెల్లో వినపడే కనపడే పేరు వైస్సార్ అని విజయమ్మ అన్నారు. రాజశేఖర్ రెడ్డికి వివక్ష అంటే తెలియదని.. కుటుంబం ఎంతో.. సాధారణ ప్రజలు అంతేనని తెలిపారు.
రాజశేఖర్ రెడ్డి చనిపోయారు అని తెలియగానే ఆంధ్ర కంటే తెలంగాణ లోనే ఎక్కువమంది చనిపోయారని అన్నారు. ప్రతీ ఎకరాకి నీళ్లు ఇచ్చినప్పుడే నా జన్మ ధన్యం అని రాజన్న పదే పదే చెప్పేవారని.. పల్లెలో జీవం తెచ్చింది రాజశేఖర్ రెడ్డి అని ఆమె అన్నారు. ఆయన వేసిన ప్రాజెక్టులు ఏ రోజుకి కూడా పూర్తి అవ్వలేదని అన్నారు. రాజశేఖర్ రెడ్డికి జగన్, షర్మిలలు నిలువెత్తు వారసులని.. వీళ్ళు ఇద్దరు వారి వారి ప్రయోజనాలకి ప్రతినిధులని విజయమ్మ అన్నారు.
నిజాయితీతో కూడిన విలువలకు ఆదర్శం మా షర్మిల పార్టీ అని.. తెలంగాణలో అసలు సిసలైన నాయకురాలు షర్మిల అని అన్నారు. షర్మిల రాజన్న ముద్దుబిడ్డ. రాజశేఖర్ రెడ్డి షర్మిలని యువరాణి లాగా పెంచుకున్నాడు. జగన్ పాదయాత్ర చేయాలి అని కోరినప్పడు షర్మిల చేసి చూపించారు. భారత దేశంలో షర్మిల లాంటి అమ్మాయిలు లేరని విజయమ్మ అన్నారు. షర్మిల ఏ పని చేసినా సంకల్పంతో చేస్తుందని అన్నారు. వైస్సార్ రాకకు ముందు తెలంగాణ గడ్డ మీద రక్తం మరకలు ఉంటే.. అదే నెల పైన నీళ్లు పారించిన ఘనడు వైస్సార్ అని విజయమ్మ అన్నారు.
అన్ని రాష్ట్రాలు బలంగా ఉంటేనే దేశం బలంగా ఉంటుందని.. రెండు తెలుగు రాష్ట్రాలు మనవేనని.. అభిప్రాయ బేధాలు వస్తే సమస్యలు పరిష్కరించుకోవాలని అన్నారు. రాజశేఖర్ రెడ్డి పిల్లలు దొంగలు కాదని.. గజ దొంగలు కానే కాదని.. మాకు దాచుకోవాడం.. దోచు కోవడం తెలియదని.. ఒక్క పంచడం తప్ప అని విజయమ్మ అన్నారు. రాజశేఖర్ రెడ్డి ప్రాణాలు కూడా ప్రజల కోసమే పోగొట్టుకున్నారని విజయమ్మ అన్నారు.