రాష్ట్రంలో దళిత బంధు పెట్టినట్లే బీసీ బంధు అమలు చేయాలని మాజీ రాజ్యసభ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ అన్నారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని ప్రధాని నరేంద్ర మోదీ.. పార్లమెంట్‌లో ఈబీసీ బిల్లు ప్రవేశ పెట్టారని.. ప్రధాని ప్రవేశపెట్టిన ఆ బిల్లులో కొత్తదనం ఏమీలేదని వీహెచ్ వ్యాఖ్యానించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి దమ్ముంటే కులాల వారీగా రిజర్వేషన్ ఏర్పాటు చేయాలని సవాల్ విసిరారు. బీసీలు కూడ ఆర్థికంగా పరిపుష్టి చెందాలంటే.. హుజురాబాద్ లో ప్రవేశ పెట్టబోతున్న దళిత బంధు తరహాలోనే రాష్ట్రమంతటా బీసీ బంధు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా ఉన్న ఓట్లు బడుగు బలహీనవర్గాల వారివే అని ఆయన అన్నారు. బీసీలను విస్మరిస్తే టీఆర్ఎస్ కు హుజురాబాద్ లో బుద్ధి చెబుతారని వ్యాఖ్యానించారు. బీసీ బంధు కోసం రాష్ట్రవ్యాప్త పోరాటం చేస్తామని ఆయన అన్నారు. అంబేద్కర్ విగ్రహాన్ని లాకప్ లో పెట్టింది ఈ ప్రభుత్వం.. ఆ విగ్రహాన్ని విడుదల చేస్తే కేసీఆర్ అసలైన దళిత ప్రేమికుడు అని నమ్ముతామని వీహెచ్ వ్యాఖ్యానించారు.