గాల్లో వాక్సిన్ డెలివరీ.. సాధ్యమయ్యేనా..!
Vaccine delivery via drones In Telangana. డ్రోన్ లను నిఘా వ్యవస్థలో పెద్ద ఎత్తున వినియోగిస్తూ ఉన్న సంగతి తెలిసిందే..!
By Medi Samrat Published on 15 May 2021 7:39 PM IST
డ్రోన్ లను నిఘా వ్యవస్థలో పెద్ద ఎత్తున వినియోగిస్తూ ఉన్న సంగతి తెలిసిందే..! అదే డ్రోన్ లను వ్యాక్సిన్ డెలివరీకి కూడా ఉపయోగించనున్నారు. అది కూడా తెలంగాణ రాష్ట్రంలో..! బ్లూ డార్ట్ కొరియర్ సంస్థ తెలంగాణ ప్రభుత్వంతో కలిసి వ్యాక్సిన్ లను కొన్ని ప్రాంతాలకు చేరవేయడానికి డ్రోన్ లను ఉపయోగించనుంది. ఈ ఆపరేషన్ కు 'మెడిసిన్ ఫ్రమ్ ది స్కై' అనే పేరును పెట్టారు. ముఖ్యంగా సుదూర ప్రాంతాలకు చేరవేయడానికి డ్రోన్ లను వినియోగించాలని భావిస్తూ ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వం, వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్, నీతి ఆయోగ్, హెల్త్ నెట్ గ్లోబల్ ఇందులో భాగస్వామ్యులు అయ్యాయి. మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కూడా ఈ ప్రాజెక్టుకు అనుమతులను ఇవ్వడంతో ఇకపై డ్రోన్లు తెలంగాణలో వ్యాక్సిన్లను, మందులను డెలివరీ చేయడం చూడొచ్చు.
సరకుల రవాణాకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని ప్రభుత్వం భావిస్తూ ఉంది. ముఖ్యంగా హెల్త్ కేర్ వస్తువులను(మందులు, వ్యాక్సిన్లు, బ్లడ్.. మొదలైనవి) డ్రోన్ ల ద్వారా వీలైనంత తొందరగా పంపించవచ్చని మెడిసిన్ ఫ్రమ్ ది స్కై ప్రాజెక్టు సభ్యులు భావిస్తూ ఉన్నారు. ఇలా చేయడం వలన ప్రజల ప్రాణాలు కాపాడే అవకాశం ఉందని అంటున్నారు. బ్లూ డార్ట్ మెడ్-ఎక్స్ ప్రెస్ కు చెందిన డ్రోన్ ల ద్వారా హెల్త్ కేర్ వస్తువులను ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ నుండి పంపించవచ్చు. టెక్నాలజీని ఉపయోగించుకుని ప్రజలకు ఉపయోగపడేలా చర్యలు తీసుకోవచ్చని బ్లూ డార్ట్ సంస్థ చెబుతూ ఉంది. ప్రస్తుతం కొన్ని పైలట్ ప్రాజెక్టుగా చేపట్టి.. ఆ తర్వాత మరిన్ని ప్రాంతాలకు విస్తరించాలని భావిస్తూ ఉన్నారు. డ్రోన్ ల ద్వారా వస్తువులను తరలించే సమయంలో కొన్ని ప్రతికూల పరిస్థితులు కూడా ఏర్పడే అవకాశం ఉంది.. వాటిని కూడా అధిగమించిన తర్వాతనే ఇది ఎంత వరకూ సక్సెస్ అన్నది తెలుస్తుంది.