రమేష్ ది రాజకీయ హత్య.. అర్హత ఉన్నా డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇవ్వలేదు : వీహెచ్

V Hanumantha Rao participated in Ramesh last Rites. డబుల్ బెడ్ రూమ్ ఇల్లు రద్దు చేశారని నిన్న పురుగుల మందు తాగుతూ సెల్ఫీ వీడియో తీసి

By Medi Samrat  Published on  6 Dec 2022 10:29 AM GMT
రమేష్ ది రాజకీయ హత్య.. అర్హత ఉన్నా డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇవ్వలేదు : వీహెచ్

డబుల్ బెడ్ రూమ్ ఇల్లు రద్దు చేశారని నిన్న పురుగుల మందు తాగుతూ సెల్ఫీ వీడియో తీసి ఆత్మహత్యాయ‌త్నానికి పాల్ప‌డిన రమేష్ ప్రాణాలు కోల్పోయాడు. డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇచ్చేందుకు కౌన్సిలర్ డ‌బ్బులు డిమాండ్ చేస్తున్నాడ‌ని ఆరోపిస్తూ ర‌మేష్ పురుగుల మందు తాగాడు. గ‌తంలో ఇల్లు ఇచ్చి రద్దు చేయడంతో రమేష్ తీవ్ర మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే ఆత్మ‌హత్య‌కు పాల్ప‌డ్డాడు. రమేష్ స్వంత ఊరు.. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వంత నియోజకవర్గం గజ్వేల్ మండలం అహ్మదీపూర్.

కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కుడు వీ హ‌నుమంత‌రావు, డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి.. రమేష్ శవయాత్రలో పాల్గొని పాడే మోశారు. అనంత‌రం వీహెచ్ మాట్లాడుతూ.. రమేష్ ది రాజకీయ హత్య అని నిప్పులు చెరిగారు. ర‌మేష్‌కు అర్హత ఉన్నా డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇవ్వలేదని మండిప‌డ్డారు. ర‌మేష్‌ ఆత్మహత్య కు కారణమైన వారిపై హత్య కేసు పెట్టి విచారణ చేయాలని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ వెంటనే స్పందించి.. రమేష్ కుటుంబానికి 50 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని.. ఆయ‌న పిల్లలకు ఉచితంగా విద్య అందించాలని.. ఆయ‌న ఇంట్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో తీవ్రమైన అక్రమాలు జరుగుతున్నాయని.. అక్రమాలపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకొని అర్హులకు ఇల్లు ఇవ్వాల‌ని వీహెచ్ కోరారు.


Next Story