భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచలో జరిగిన రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య సంఘటన నిజంగా బాధాకరమైన సంఘటన అని సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ రాజ్యసభ సభ్యుడు వి.హనుమంత రావు అన్నారు. బాధిత కుటుంబం ఆత్మహత్యకు ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు వనమా రాఘవ కారణమని.. రామకృష్ణ సూసైడ్ నోట్ రాయడంతో పాటు వీడియో కూడా రికార్డు చేయడం.. మీడియాలో రావడం జరిగినా రాష్ట్ర ప్రభుత్వం, కేసీఆర్ స్పందించికపోవడం బాధాకరమని వీహెచ్ అన్నారు. పోలీసులు ఇంకా వనమా రాఘవను అరెస్ట్ చేయకపోవడం.. నిందితుడు ఇంక పరారిలో ఉండడంపై ఎన్నో అనుమానాలు కలుగుతున్నాయని అన్నారు.
అధికార పార్టీలో ఉన్నామని, తండ్రి ఎమ్మెల్యే అని, రాఘవ చేసిన దురాఘతాలపై ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం పట్ల ప్రజలు ముఖ్యంగా మహిళలలో అభద్రతాభావం పెరగక ముందే ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించాలని వీహెచ్ డిమాండ్ చేశారు. వనమా వెంకటేశ్వరరావు, అతని కుమారులను పార్టీ నుండి సస్పెండ్ చేయాలని అన్నారు. వనమా వెంకటేశ్వరావుతో వెంటనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయించి.. రాఘవను అరెస్ట్ చేసిన తదుపరి అతడిపై నిర్భయ చట్టం మరియు ఇతర చట్టాల ప్రకారం కఠినమైన చర్యలు తీసుకొని.. మహిళల పట్ల ఉన్న చిత్తశుద్ధిని కేసీఆర్ నిరూపించుకావాలని వీహెచ్ డిమాండ్ చేశారు.