పీసీసీ ఇచ్చిన ఆదేశాల మేరకు అందరం రైతుల కల్లాల్లోకి వెళ్ళామని మాజీ ఎంపీ వీహెచ్ అన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద వడ్ల కొనుగోలు జరగడం లేదని.. ఒక్కో కేంద్రం వద్ద వందకు పైగా వడ్ల కుప్పలు ఉన్నాయని.. కొన్ని సెంటర్ల వద్ద మందకోడిగా కొనుగోలు జరుగుతుందని ఆయన తెలిపారు. వర్షాలకు వడ్ల కుప్పలు మొలకలు వస్తున్నాయని.. ప్రభుత్వం మిల్లర్ల కోసమే పని చేస్తుందని.. రైతుల కోసం కాదని విమర్శించారు. రైతులు చనిపోయినా ప్రభుత్వానికి పట్టడం లేదని.. చనిపోయిన రైతులవి సహజ మరణాలుగా చూపే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. వ్యవసాయ మంత్రి మీడియా సమావేశాలకు పరిమితం అవుతున్నారని.. ప్రభుత్వానికి ప్రగల్భాలు ఎక్కువ.. పని తక్కువని విమర్శించారు.
యాసంగి లో ఏం పంట వేయాలో మోదీని అడగడం ఎందుకు.. ఏం వేయాలో రైతులకు తెలుసనని వీహెచ్ అన్నారు. ఐకేపీ సెంటర్ల వద్ద వడ్ల కుప్పలపై కప్పే తాటిపత్రి ప్రభుత్వం అందించాలని డిమాండ్ చేశారు వీహెచ్. వ్యవసాయ చట్టాల రద్దుపై టీఆర్ఎస్ క్రెడిట్ తీసుకోవడం హాస్యాస్పదమని.. చెన్నూర్ లో చనిపోయిన నిరుద్యోగి కుటుంబాన్ని రేపు పరామర్శిస్తానని తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులు ఇకనైనా అందరూ ఐక్యంగా ఉండాలని.. లేకుంటే కార్యకర్తలు మనల్ని తన్నడం ఖాయమని వీహెచ్ అన్నారు. మొదట నేను కూడా రేవంత్ రెడ్డిని పీసీసీ అధ్యక్షుడిగా వ్యతిరేకించానని.. సోనియా గాంధీ పీసీసీగా రేవంత్ ను నియమించాక కలిసి పనిచేస్తున్నానని తెలిపారు.