టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బదిలీల కోసం డ‌బ్బులు తీసుకుంటున్నారు : ఉత్తమ్

Uttamkumar Reddy Fires On TRS. మట్టంపల్లి మండలంలోని గుర్రంపోడ్ తండాలో దాడికి గురైన బాధిత కాంగ్రెస్ కుటుంబాలను

By Medi Samrat  Published on  23 Sep 2021 3:23 PM GMT
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బదిలీల కోసం డ‌బ్బులు తీసుకుంటున్నారు : ఉత్తమ్

మట్టంపల్లి మండలంలోని గుర్రంపోడ్ తండాలో దాడికి గురైన బాధిత కాంగ్రెస్ కుటుంబాలను కాంగ్రెస్‌ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి పరామర్శించారు. దాడిలో ద్వంసమైన ఇండ్లు, జరిగిన నష్టాన్ని చూసిన ఉత్త‌మ్‌.. దాడిని తీవ్రంగా ఖండించారు. ఈ సంద‌ర్భంగా ఉత్త‌మ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. అధికార పార్టీ గూండాలు స్థానిక అధికారులు, పోలీసుల అండతో రెచ్చిపోతున్నారని అన్నారు. చాలా మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బదిలీల కోసం ఎస్‌ఐ, సీఐ, డీఎస్‌పీల‌ నుండి రూ 5- 20 లక్షలు తీసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయ‌ని.. దీంతో సీఎంవో బదిలీలను సులభతరం చేస్తున్నారని అన్నారు. ఇలాంటి అవినీతి పనుల వలన సమర్ధులైన, నిజాయితీ గల పోలీసు అధికారులు బాధపడుతున్నారని అన్నారు.

టీఆర్ఎస్ పాలనలో దళితులు, గిరిజనులపై దాడులు రోజురోజుకు పెరుగుతున్నాయని.. స్థానిక సబ్‌ ఇన్స్పెక్టర్‌ను సస్పెండ్ చేయాలని ఉత్త‌మ్‌ డిమాండ్ చేశారు. మట్టంపల్లి మండలంలో గిరిజనులకు భూమి ఇస్తామని అసెంబ్లీలో సీఎం చెప్పారు. కానీ ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే, అతని అనుచరులు గిరిజనుల భూమిని లాక్కుంటున్నారు. ఇది చాలా అమానుషం. టీఆర్ఎస్ నేతలు పేదల భూముల జోలికొస్తే ఊరుకునేది లేదని హెచ్చ‌రించారు. తెలంగాణ వ్యాప్తంగా ఇసుక, ల్యాండ్, మైన్స్, వైన్స్‌లో టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు దోపిడీలో బిజీగా ఉన్నారని ఆరోపించారు.


Next Story