గోదావరి వరదలపై సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే..! దీని వెనుక కుట్రలు ఉన్నాయని, క్లౌడ్ బరస్ట్ జరిగిందని అనుమానం వ్యక్తం చేశారు. ఇరత దేశాల వాళ్లు కుట్రలు చేస్తున్నారని, గతంలో లేహ్‌లో, ఉత్తరాఖండ్‌లో ఇలాగే క్లౌడ్ బరస్ట్ చేశారని ఆరోపించారు. ఇప్పుడు గోదావరి పరివాహక ప్రాంతాల్లో క్లౌడ్ బరస్ట్ చేస్తున్నట్లుగా తమకు సమాచారం వచ్చిందని కేసీఆర్ అన్నారు. ఈ నెల 29 వరకు వర్షాలు పడతాయని వాతావరణశాఖ చెబుతోందని, ప్రమాదం తప్పిందని అనుకోవద్దని అధికారులకు సూచించారు.
కేసీఆర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. కాళేశ్వరం ప్రాజెక్టు మునిగిపోవడంతో ప్రజల దృష్టిని మళ్లించేందుకే కేసీఆర్ 'క్లౌడ్ బరస్ట్' అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. "తెలంగాణలో వర్షాలు, వరదలకు అంతర్జాతీయ కుట్రలు కారణమా?... కేసీఆర్ అర్థంలేకుండా మాట్లాడుతున్నారు" అంటూ విమర్శించారు. క్లౌడ్ బరస్ట్ అనేది చిన్న ప్రాంతాల్లోనే వీలుపడుతుందని, ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇలా మాట్లాడడం సరికాదని అన్నారు.