రాజీనామాను సమర్పించిన మంత్రి ఉత్తమ్

తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తన లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు.

By Medi Samrat  Published on  13 Dec 2023 8:15 PM IST
రాజీనామాను సమర్పించిన మంత్రి ఉత్తమ్

తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తన లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. తాను ఎంపీ పదవికి రాజీనామా చేసినట్లు స్వయంగా ఆయనే ప్రకటించారు. ప్రస్తుతం ఆయన ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఆయన తొలుత తన భార్య పద్మావతిరెడ్డితో కలిసి ఢిల్లీ జన్‌పథ్‌లో ఏఐసీసీ అగ్రనాయకురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను కలిశారు. సోనియాను కలిసిన అనంతరం ఉత్తమ్ మీడియాతో మాట్లాడుతూ, సోనియాతో పాటు రాహుల్ గాంధీని కూడా మర్యాదపూర్వకంగా కలిసినట్లు తెలిపారు. అక్కడి నుంచి పార్లమెంటుకు వెళ్లారు. అక్కడ స్పీకర్‌కు తన రాజీనామా పత్రాన్ని సమర్పించారు.'నేను పార్లమెంటుకు వెళ్లి లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు రాజీనామాను సమర్పించాను' అని ఉత్తమ్ కుమార్ రెడ్డి ట్వీట్ చేశారు.

ఉత్తమ్ కుమార్ రెడ్డి 2019 లోక్ సభ ఎన్నికల్లో నల్గొండ లోక్ సభ స్థానం నుంచి గెలుపొందారు. ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో హుజూర్ నగర్ నుంచి గెలిచి, రేవంత్ రెడ్డి కేబినెట్లో చోటు దక్కించుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన లోక్ సభ సభ్యత్వానికి రాజీనామాను సమర్పించారు.

Next Story