పోలీసులు, డబ్బుతో కేసీఆర్ పాలన నడుస్తోంది : ఎంపీ ఉత్తమ్

Uttam Kumar Reddy Fire On CM KCR. రాష్ట్రంలో ఇంత వికృతమైన పరిపాలన ఊహించలేదని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.

By Medi Samrat  Published on  18 April 2022 1:28 PM GMT
పోలీసులు, డబ్బుతో కేసీఆర్ పాలన నడుస్తోంది : ఎంపీ ఉత్తమ్

రాష్ట్రంలో ఇంత వికృతమైన పరిపాలన ఊహించలేదని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో ఒక కుటుంబం, కొంత మంది పోలీసు అధికారుల మాఫీయా నడుస్తుందని.. టిఆర్ఎస్ నేతలు, పోలీసు అధికారుల వేధింపులు తాళ‌లేక రామాయంపేటలో ఓ కుటుంబం బలైందని అన్నారు. వామన్ రావు దంపతుల హాత్య నడిరోడ్డుపై జరిగితే.. ఇంతవరకు దోషులను పట్టుకోలేదు.. కొత్తగూడెం లో ఎమ్మెల్యే కొడుకు చేసిన పనికి ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది.. విచారణ ఎక్కడికి వచ్చిందో ఎవరికి చెప్పరని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

కేసీఆర్ పాలన పోలీసులు, డబ్బుతో నడుస్తోందని.. టిఆర్ఎస్ పార్టీని బొంద పెట్టడం ఖాయమ‌ని విమ‌ర్శించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పోలీసులకు మంచి పేరు ఉండేది.. కానీ ఇప్పుడు కేసీఆర్ ఆ వ్యవస్థను నాశనం చేసారని ఆరోపించారు. కేసీఆర్ కు అనుకూలంగా పనిచేయని అధికారులను పక్కన పెడుతున్నారని.. జిల్లా ఎస్పీ అంటే.. ఐపీఎస్ ఆఫీసర్ లు ఉండే వారు.. ఇప్పుడు 20 మంది నాన్ ఐపీఎస్ అధికారులు ఉన్నారని.. టిఆర్ఎస్ కు సహాకరిస్తున్న వారికే ఎస్పీ పోస్టింగ్ లు ఇస్తున్నారని విమ‌ర్శించారు.

హైదరాబాద్ పరిధిలో డీసీపీ లు సంవత్సరాలు పైబడిన ఓకే దగ్గర పనిచేస్తున్నారని. మరికొందరికి అసలు పోస్టింగ్ లే ఇవ్వలేదని అన్నారు. టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు లక్షల రూపాయలు తీసుకుని ఎస్సై, ఇతర పోస్టింగ్ లకు రికమెండ్ చేస్తున్నారని.. డబ్బులు తీసుకుని పోస్టింగ్ లు ఇవ్వడం వల్లే.. రామాయంపేట లాంటి సంఘటనలు జరుగుతున్నాయ‌ని అన్నారు. ఖమ్మంలో మున్సిపల్ కౌన్సిలర్ ముస్తఫాపై దొంగ కేసు పెడితే.. కోర్ట్ కొట్టేసింది. హుజూర్ నగర్ లో గోపీగౌడ్ అనే వ్యక్తిపై కేసు పెడితే.. నేను తప్పుడు కేసు అని మాట్లాడితే పోలీసులు వినలేదు.. గోపీగౌడ్ టిఆర్ఎస్ లో చేరిన తర్వాత కేసు తొలగించారని అన్నారు. ఎమ్మెల్యే లకు 5, 6 పైలెట్ ఎస్కార్ట్ లు ఎందుకని ఉత్త‌మ్ ప్ర‌శ్నించారు. గ్రామాల్లో టిఆర్ఎస్ నేతలు అరాచకం చేస్తున్నారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. కేసీఆర్ మేనల్లుడు సంతోష్ చెప్తేనే పోలీసు శాఖలో బదిలీలు జరుగుతున్నాయ‌ని ఆరోపించారు.
Next Story
Share it