కోదాడలో నూతన రైల్వే లైన్ కోసం అనేక సార్లు ప్రయత్నం చేసామని.. చాలా మంది కేంద్ర మంత్రులను కలిసి విజ్ఞప్తి చేసినట్లు నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. కోదాడ, హుజుర్ నగర్ ప్రాంతాలలో అన్ని రకాల ఉత్పత్తుల సామర్థ్యం ఎక్కువ ఉంటుంది. మెరుగైన ట్రాన్స్‌పోర్టు ఫెసిలిటీ ఉంటే ఆ ప్రాంతం అబివృద్ది చెందుతుందని అన్నారు. డోర్నకల్, మిర్యాలగూడ మధ్య లో కొత్త రైల్వే లైన్ శాంక్షన్ అయిందని.. హుజూర్ నగర్, కోదాడ మీదుగా ఈ లైన్ వెళ్తుందని పేర్కొన్నారు. 93 కిలోమీటర్లు ఉండే ఈ లైన్ కు 1294 కోట్లు ఖర్చు అవుతుందని తెలిపారు. నాలుగేళ్ళ లోపు ప్రాజెక్టు పూర్తి అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలపై నేను మాట్లాడనని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. పార్టీ ఇంఛార్జ్, ఏఐసీసీ నేతలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యవహారం గురించి మాట్లాడుతారని అన్నారు. మునుగోడులో కాంగ్రెస్ గెలవబోతుందని జోస్యం చెప్పారు. ఎవరు ఏం మాట్లాడినా.. మునుగోడు ఓటర్లు పట్టించుకోరని అక్కడి ప్రజలపై భరోసా వ్యక్తం చేశారు.