కోమ‌టిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కలిసిన ఉత్తమ్

Uttam Kumar meets Rajagopal Reddy. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భారతీయ జనతా పార్టీలో చేర‌నున్నార‌నే వార్తల నేప‌థ్యంలో

By Medi Samrat
Published on : 30 July 2022 1:42 PM IST

కోమ‌టిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కలిసిన ఉత్తమ్

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భారతీయ జనతా పార్టీలో చేర‌నున్నార‌నే వార్తల నేప‌థ్యంలో టిపిసిసి మాజీ చీఫ్, నల్గొండ ఎంపి ఉత్తమ్ కుమార్ రెడ్డి శనివారం నాడు ఆయనను కలిశారు. పార్టీ అసంతృప్త నేత రాజగోపాల్ రెడ్డిని శాంతింపజేయాలని ఏఐసీసీ ఉత్తమ్ కుమార్ రెడ్డిని కోరినట్లు సమాచారం. పార్టీని వీడకూడదని ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో చర్చించినట్లు సమాచారం. రాజగోపాల్ రెడ్డి ఇటీవల బీజేపీ పెద్దలతో సమావేశమయ్యారని.. త్వరలో కాంగ్రెస్‌ను వీడనున్నట్టు సంకేతాలు ఇస్తున్నారని సమాచారం.

మూడు రోజుల క్రితం పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వ్యవహారాన్ని ప్రస్తావిస్తూ.. ఈ అంశంపై పార్టీలో అంతర్గతంగా చర్చిస్తామని, దీనిపై పార్టీ హైకమాండ్ తుది నిర్ణయం తీసుకుంటుందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలిపారు. రాజగోపాల్‌రెడ్డి వీలైనంత త్వరగా కాంగ్రెస్‌ పార్టీని వీడనున్నట్టు ప్రకటించిన నేపథ్యంలో.. ఆయన వ్యవహారం రాష్ట్రంలో చర్చనీయాంశమైంది. రాజగోపాల్‌రెడ్డి చేరిక‌పై రాష్ట్ర బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌ కుమార్ కూడా స్పందించారు.

మాజీ ఎంపీ, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి.. పార్టీ సీనియర్ నేతలతో కలిసి రాజగోపాల్‌ రెడ్డి పార్టీలో చేరికపై సంప్రదింపులు జరిపినట్లు తెలిపారు. జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఢిల్లీలో చేరికలు జరుగుతాయని పార్టీ వర్గాలు తెలిపాయి. రాజగోపాల్‌ రెడ్డి కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కూడా కలిసే అవకాశం ఉన్న‌ట్లు వార్త‌లు వెలువ‌డుతున్నాయి.














Next Story