తెలంగాణలో ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. అధికార పార్టీ బీఆర్ఎస్ మూడోసారి అధికారం చేపట్టాలని ముందుగానే అభ్యర్థులను ప్రకటించారు. 95 శాతం అభ్యర్థులను ఇప్పటికే ప్రకటించారు సీఎం కేసీఆర్. ఇక ఇతర పార్టీలు కూడా అభ్యర్థులను ఖరారు చేసే పనిలో పడ్డాయి. కొందరు నాయకులు అయితే.. ప్రజల్లోకి వెళ్తూ ప్రచారాలు చేస్తున్నారనే చెప్పాలి. ఇక కేంద్రంలోనూ ఎన్డీఏ కూటమిని గద్దె దింపాలని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. అందుకే విపక్ష పార్టీలన్నీ ఏకమై ఇండియా కూటమిగా ఏర్పడ్డాయి. ఎన్నికల కోసం ప్రణాళికా బద్దంగా ముందుకెళ్తున్నాయి.
ఈ క్రమంలో తెలంగాణ కాంగ్రెస్ మాజీ చీఫ్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కొద్ది నెలల్లో తెలంగాణలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని జోస్యం చెప్పారు. సూర్యాపేట జిల్లాలోని నేరేడుచర్ల, గరిడేపల్లి పాలకవీడు మండలాల్లో కాంగ్రెస్ ముఖ్యనాయులతో నిర్వహించిన సమావేశంలో పాల్గొని ఈ వ్యాఖ్యలు చేశారు ఉత్తమ్. తెలంగాణలో గెలుపు తమేదనని దీమా వ్యక్తం చేశారు. అంతేకాదు.. త్వరలో ఐదు రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ విజయం సాధిస్తుందని చెప్పారు. కర్ణాటకలో వెలువడ్డ ఫలితాలే రిపీట్ అవుతాయని తెలిపారు. ఇక ఇండియా కూటమి విజయం సాధించాక.. రాహుల్‌గాంధీ ప్రధాని అవుతారని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పుకొచ్చారు.