హైదరాబాద్: యూరియా పొందాలంటే రైతులు నేటి నుంచి Fertilizer Booking Appతో మాత్రమే బుక్ చేసుకోవాలి. ఈ నెల 20 నుంచి కొన్ని జిల్లాల్లో ఈ విధానం అందుబాటులోకి రాగా, రాష్ట్ర వ్యాప్తంగా ఇకపై ఇదే విధానం అమలు కానుంది. పారదర్శకంగా, నిజమైన లబ్ధిదారులకే యూరియా పంపిణీకి ఈ విధానం తెచ్చామని ప్రభుత్వం తెలిపింది. యాప్ ద్వారా యూరియా ఎలా బుక్ చేసుకోవాలి? ఏ పంటకు ఎన్ని బస్తాలు ఇస్తారో ఇప్పుడు తెలుసుకుందాం..
యాప్‌లో యూరియా ఎలా బుక్ చేసుకోవాలి?
ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకుని ఫోన్ నెంబర్ అప్లోడ్ చేసి ఓటీపీ ఎంటర్ చేయాలి. తర్వాత పట్టాదారు పాస్‌బుక్ నెంబర్ ఎంటర్ చేస్తే మరో ఓటీపీ వస్తుంది. అది ఎంటర్ చేస్తే భూమి వివరాలు వస్తాయి. ఏ పంట సాగు చేస్తున్నారో క్లిక్ చేస్తే, ఎన్ని బస్తాల యూరియా వస్తుందో, డీలర్ వివరాలు, వారి దగ్గర ఉన్న యూరియా బస్తాల సంఖ్య వస్తుంది. బుకింగ్ కోడ్ రాగానే డీలర్ వద్దకు వెళ్లి 24 గంటల్లో యూరియా తీసుకోవాలి.
ఏ పంటకు ఎన్ని బస్తాల యూరియా ఇస్తారు?
వరికి ఎకరానికి రెండున్నర బస్తాలు.. చెరుకు, మిరప, మొక్కజొన్న పంటలకు ఎకరానికి 5 బస్తాల వరకే బుక్ చేసుకోవాలి. అంతకుమించి బుక్ చేసుకునే వీలులేదు. ఒకసారి బుకింగ్ చేసుకుంటే 24 గంటల్లో యూరియా తీసుకోవాల్సి ఉంటుంది. తీసుకోకుంటే బుకింగ్ రద్దు అవుతుంది. 15 రోజుల్లో మళ్లీ బుకింగ్ చేసుకోవచ్చు. ఏ జిల్లా రైతులు అదే జిల్లాలోనే యూరియా బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. పక్క జిల్లాలో బుకింగ్ చేసుకునే అవకాశం ఉండదు.