బీజేపీ యువ నేత, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ నివాసంపై జరిగిన దాడిని బీజేపీ నాయకులు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఎంపీ అరవింద్ ను, ఆయన తల్లిని పరామర్శించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ నేతలపై కిషన్ రెడ్డి మండిపడ్డారు. కల్వకుంట్ల కుటుంబాన్ని చీల్చాలని తాము ఎప్పుడూ భావించలేదని, కవితను బీజేపీలో చేరాలని ఒత్తిడి చేస్తున్నామని కేసీఆర్ అనడం అర్థరహితమని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర రాజధానిలో రాజకీయ నేతలు, ప్రముఖులు నివసించే ప్రాంతంలోనే ఈ దాడులు జరిగాయని.. టీఆర్ఎస్ నేతలు తీవ్ర నిరాశలో ఉండడం వల్లే ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఓడిపోతామన్న భయం, సీఎం పీఠం కోల్పోతామన్న భయంతో దాడులు చేయిస్తున్నారని అన్నారు. బీజేపీ సిద్ధాంతాలు నచ్చి, మోదీ నాయకత్వంపై నమ్మకం ఉన్నవారిని మాత్రమే పార్టీలోకి తీసుకుంటామని స్పష్టం చేశారు.
కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ.. తెలంగాణలో బీజేపీ ప్రభంజనాన్ని చూసి తట్టుకోలేక తమ ప్రజా ప్రతినిధుల ఇళ్లపై టీఆర్ఎస్ దాడులకు పాల్పడుతోందని.. బీజేపీ ఎంపీ అర్వింద్ ఇంటిపై దాడి చేయడం సరికాదన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేయకుండా ఈ తరహా దాడులు చేయడం దారుణమన్నారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ప్రజాదారణ కోల్పోతోందని భావించే.. ఇలాంటి డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు.