హైదరాబాద్‌ నడిబొడ్డున దీక్ష చేస్తా..సీఎం రేవంత్‌కు బండి సంజయ్ లేఖ

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు.

By -  Knakam Karthik
Published on : 10 Feb 2026 5:20 PM IST

Bandi Sanjay, CM Revanthreddy, Telangana Government, Retired Employees

హైదరాబాద్‌ నడిబొడ్డున దీక్ష చేస్తా..సీఎం రేవంత్‌కు బండి సంజయ్ లేఖ

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ మంగళవారం బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు రిటైర్డ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఆయన ఈ లేఖ రాశారు. రాష్ట్రంలో దాదాపు 3 లక్షల మంది రెగ్యులర్, 4 లక్షల మంది రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించిన 5 డీఏలు (DA) పెండింగ్‌లో ఉన్నాయని బండి సంజయ్ గుర్తు చేశారు. 2023 జూలై నుండే అమలు కావాల్సిన పీఆర్సీపై ప్రభుత్వం ఇప్పటివరకు నివేదిక కూడా తెప్పించుకోకపోవడం పట్ల ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఉద్యోగులు దాచుకున్న గ్రాట్యుటీ, ఈపీఎఫ్, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ వంటి ప్రయోజనాలను రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో చెల్లించడం లేదని ఆరోపించారు. దీనివల్ల రిటైర్డ్ ఉద్యోగులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని లేఖలో పేర్కొన్నారు. పెండింగ్ బకాయిలు అందక, ఆర్థికంగా చితికిపోయి మానసిక వేదనతో గత ఏడాది కాలంలో 61 మంది రిటైర్డ్ ఉద్యోగులు మరణించారని బండి సంజయ్ సంచలన ఆరోపణ చేశారు. వృద్ధాప్యంలో వారికి అండగా ఉండాల్సిన ప్రభుత్వం, వారి ఉసురు పోసుకుంటోంది" అని విమర్శించారు.

ఉద్యోగులకు ప్రభుత్వం మొత్తం రూ. 12 వేల కోట్లకు పైగా బకాయిలు పడిందని, రూ. 2.5 లక్షల కోట్ల వార్షిక బడ్జెట్ ఉన్న రాష్ట్రానికి ఇది పెద్ద మొత్తం కాదని.. కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే చెల్లింపులు జరగడం లేదని దుయ్యబట్టారు. మున్సిపల్ ఎన్నికల తర్వాత ఉద్యోగ, ఉపాధ్యాయుల పక్షాన బీజేపీ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడుతుందని బండి సంజయ్ హెచ్చరించారు.

Next Story