సడన్‌గా తీసుకున్న నిర్ణయం కాదు..కులగణనపై కిషన్ రెడ్డి స్పందన
జనగణనలో భాగంగా కులగణన చేపట్టాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.
By Knakam Karthik
సడన్‌గా తీసుకున్న నిర్ణయం కాదు..కులగణనపై కిషన్ రెడ్డి స్పందన
జనగణనలో భాగంగా కులగణన చేపట్టాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఇందుకు గానూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ గారికి హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపారు. ఆయా రాష్ట్రాలు కులగణన పేరుతో వారికి అనుకూలంగా సర్వేలు చేపట్టి ప్రజల్లో ఆందోళనలు రేకెత్తిస్తున్న సందర్భంలో.. ప్రజాభిప్రాయం మేరకు, సామాజిక సమరసతను దృష్టిలో ఉంచుకుని జనగణనలో భాగంగా కులగణన చేయాలని నిర్ణయించడం మంచి పరిణామం. ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి రెండేళ్లపాటు ఈ సర్వే జరగనుంది.
కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు కుల గణన పేరుతో స్వార్థపూరిత రాజకీయాలకు తెరలేపాయి. దీన్నో రాజకీయ అస్త్రంగా వాడుకుని.. ప్రజల్లో ఆందోళనలు రేకెత్తించేందుకు ప్రయత్నించాయి. కానీ, ప్రజాప్రయోజనాలను కాపాడే విషయంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ చిత్తశుద్ధితో వ్యవహరిస్తోంది. తాజా నిర్ణయం కేంద్ర ప్రభుత్వ నిబద్ధతకు మరొక తాజా ఉదాహరణ. గతంలో మోదీ సర్కారు.. అగ్రవర్ణ పేదలకోసం 10% EWS రిజర్వేషన్లు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.
స్వాతంత్ర్యం వచ్చినప్పటినుంచి ప్రజలను మతం పేరుతో విడదీయడం అలవాటైన కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు కులం పేరుతో భారతీయ సమాజాన్ని విడదీసేలా కుట్రలు పన్నింది. కులగణను రాజకీయ ప్రయోజనాలకోసం వాడుకోవాలని చూస్తోంది. కానీ బీజేపీ సామాజిక న్యాయం, పరిపాలనా సౌలభ్యం కోసం జనగణనతోపాటుగా కులగణన జరగాలని కోరుకుంది. ఇది ఇవాళ కేంద్రప్రభుత్వం సడన్ గా తీసుకున్న నిర్ణయం కాదు. 18 సెప్టెంబర్ 2024 నాడు.. కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షా గారు మాట్లాడుతూ.. కులగణనపై సరైన సమయంలో అందరికీ తెలియజేస్తామని చెప్పారు. తదనుగుణంగానే.. ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం వెల్లడించింది..అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు.