ఏడాది ముగుస్తుంది.. గ్యారంటీలు, డిక్లరేషన్లు ఎటు పోయాయి..? : కిషన్ రెడ్డి
By Kalasani Durgapraveen Published on 4 Nov 2024 3:21 PM ISTకాంగ్రెస్ భారత ప్రజలను గారడీలతో మోసం చేసేందుకు ప్రయత్నం చేస్తోందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ,కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు అస్తవ్యస్తంగా తయారు అయ్యాయి అన్నారు.తెలంగాణలో ఆరు గ్యారెంటీలు వంద రోజుల్లో అమలు చేస్తామన్నారు.. ఏడాది ముగుస్తుంది గ్యారంటీ లు, డిక్లరేషన్లు ఎటు పోయాయి..? కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, తెలంగాణ ప్రజలు ప్రశ్నిస్తున్నారన్నారు.
కుట్రలు, కుయుక్తలె కాంగ్రెస్ నైజం అని విమర్శించారు. అంతులేని హామీలు, ఆచరణకు సాధ్యంకాని హామీలు, మోసపూరితమైన హామీలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది.. హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం నిస్సహాయత స్థితిలో ఉండిపోయిందన్నారు. కర్ణాటకలో ముఖ్యమంత్రి భార్య 15 ఎకరాల ప్రభుత్వ భూమిని తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకుందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ భరి తెగించి ప్రవర్తిస్తోందని, అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అమలు కానీ హామిలిచ్చి పది నెలలో ప్రజల నమ్మకం కోల్పోయిందన్నారు. కర్ణాటక, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు అమలయ్యే సంక్షేమ పథకాలను అటకెక్కించిందన్నారు. హామీల పేరుతో ప్రజల ఓట్లను కాంగ్రెస్ దండుకుంటుందన్నారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లిఖార్జున్ ఖర్గే ఇచ్చిన గ్యారంటీలు ఎక్కడికిపోయాయి అని కర్ణాటక, తెలంగాణ ప్రజలు ప్రశ్నిస్తున్నారన్నారు.
ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన ఆర్థిక స్థితి గ్రహించకుండా అంతులేని, ఆచరణకు సాధ్యంకాని హామీలు ఇస్తుందని, హిమాచల్ ప్రదేశ్ లో ఏ ఒక్క రంగం పని చేయకుండా నిస్సహాయ స్థితిలో ఉందన్నారు. తెలంగాణలో అమలు అయ్యేది ఒక మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మాత్రమే అన్నారు. కర్ణాటక రాష్ట్రం దివాలతీసే పరిస్థితి ఏర్పడిందని, కర్నాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అవినీతి విలయ తాండవం చేస్తుందన్నారు.
అశోక్ నగర్ లో నిరుద్యోగ యువత ఆకలి కేకలను పోలీస్ లాఠీలతో అణిచి వేస్తున్నారు. బీఆర్ఎస్ కు కాంగ్రెస్ కు తేడా ఏంటో కాంగ్రెస్ నేతలు చెప్పాలన్నారు. ఏడాది కాకముందే దాదాపు లక్ష కోట్ల అప్పు తీసుకుంది. అప్పులు తేవడం కోసం టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేశారన్నారు. అరకొర రుణమాఫీ చేసి పూర్తిగా చేసినట్లు అబద్ధాలు చెబుతుంది. ఏ పంటకు బోనస్ ఇవ్వలేదు.. సిగ్గు లేకుండా, రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేతలు తెలంగాణలో 31వేల కోట్ల రుణమాఫీ జరిగిందని ప్రచారం చేస్తున్నారన్నారు. 16,41, 428మందికి ఇంకా రుణమాఫీ చేయాలి. కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి ఎంత రుణమాఫీ జరిగిందో ప్రజల ముందు పెట్టాలన్నారు. మహిళలకు తులం బంగారం, స్కూటీలు ఎక్కడికిపోయాయో తెలపాలన్నారు. కొండంత హామీలు ఇచ్చి.. ఎలుకంత హామీలను కూడా అమలు చేయలేదు.. దేశానికి కాంగ్రెస్ పార్టీ శనిలా ఉందన్నారు.