బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి మార్పుపై.. కిషన్‌రెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్
తెలంగాణ బీజేపీ నాయకత్వంలో మార్పు జరగబోతోందంటూ గత కొన్ని రోజులుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. తాజాగా ఈ అంశంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక కామెంట్స్ చేశారు.
By అంజి Published on 2 July 2023 2:53 PM ISTబీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి మార్పుపై.. కిషన్‌రెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్
తెలంగాణ బీజేపీ నాయకత్వంలో మార్పు జరగబోతోందంటూ గత కొన్ని రోజులుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. తాజాగా ఈ అంశంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక కామెంట్స్ చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి విషయంలో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేశారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు బాధ్యత ప్రభుత్వానిదేనని, గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలన్నారు. కిషన్ రెడ్డి ప్రస్తుతం వరంగల్ పర్యటనలో ఉన్నారు. ఈ నెల 8వ తేదీన ప్రధాని మోదీ వరంగల్‌కు రానున్నారు. ఈ నేపథ్యంలోనే సభా ఏర్పాట్లపై కిషన్‌రెడ్డి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మోదీ ప్రధాని అయిన తర్వాత మొదటిసారిగా కాకతీయులు ఏలిన ఓరుగల్లు గడ్డమీదకి వస్తున్నారని అన్నారు. మోదీకి స్వాగతం పలికేందుకు వరంగల్ ప్రజలు ఎదురు చూస్తున్నారని అన్నారు.
వివిధ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన కోసం వస్తున్నారని చెప్పారు. భద్రకాళి అమ్మవారిని మోదీ దర్శించుకుంటారని తెలిపారు. మౌళిక వసతులకు కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, వరంగల్ నగరాన్ని స్మార్ట్‌సిటీ అమృత్ నగరంగా అభివృద్ధి చేస్తున్నామని, వెయ్యి స్తంభాల గుడిలో కళ్యాణ మంటపాన్ని పూర్తిస్థాయిలో మోదీ ఆదేశంతో పునఃనిర్మిస్తున్నామని తెలిపారు. అన్ని రాష్ట్రాలపై కేంద్రానిది ఒకే విధానమన్నారు. రైల్వే వ్యాగన్ మ్యాన్‌ఫ్యాక్చరింగ్ యూనిట్‌కు ప్రధాని మోదీ శంకుస్థాపన చేస్తారని కిషన్ రెడ్డి తెలిపారు. ఇప్పటికైనా కేసీఆర్ సర్కార్ స్పందిస్తే సైనిక్ స్కూల్ ఏర్పాటు చేస్తామన్నారు. గిరిజన వర్సిటీ విషయంలో కేంద్రం వెనకడుగు వేసే ప్రసక్తే లేదన్నారు.
నేషనల్ హైవేస్ వేగంగా అభివృద్ధి చేస్తున్నామని, హైదరాబాద్ చుట్టు ఐదారు జిల్లాలను కలుపుతూ రీజినల్ రింగ్ రోడ్డు ఆర్ఆర్ఆర్ 26 వేల కోట్లతో ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 50 శాతం చొప్పున భాగస్వామ్యంతో ఆర్‌ఆర్‌ఆర్ ఏర్పాటు జరుగుతుందన్నారు. సీఎం కేసీఆర్‌ను భూసేకరణ పూర్తి చేయాలని కోరుతున్నామని చెప్పారు. ఆర్ఆర్ఆర్‌కు అనుసంధానంగా ప్రతిష్టాత్మకమైన ఔటర్ రింగ్ రైల్ ప్రాజెక్టు చేపట్టాలని సంకల్పించామని, దేశంలో ప్రప్రథమంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేయాలని నిర్ణయించి సర్వే చేయించామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల సహకారం అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు ప్రచారంతో బురద జల్లే ప్రయత్నం చేస్తోందని కిషన్‌రెడ్డి అన్నారు. స్వార్థ రాజకీయాల కోసం అసత్య ప్రచారం చేయవద్దన్నారు.