అమెరికా, పాకిస్థాన్ అధ్యక్షుల‌ను కలిసినా మేము భయపడం

Union Minister Kishan Reddy Fire On CM KCR. కొవిడ్ ఆర్థిక పరిస్థితులు, ఉక్రెయిన్, రష్యా యుద్ధం కారణంగా క్రూడ్ ఆయిల్ ధరలు

By Medi Samrat  Published on  22 May 2022 11:46 AM GMT
అమెరికా, పాకిస్థాన్ అధ్యక్షుల‌ను కలిసినా మేము భయపడం

కొవిడ్ ఆర్థిక పరిస్థితులు, ఉక్రెయిన్, రష్యా యుద్ధం కారణంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఆ ఎఫెక్ట్ అమెరికా వంటి దేశాలతో పాటు భారత్ పై కూడా పడిందని.. కొద్ది రోజుల కింద ప్రజలపై భారం తగ్గించేందుకు కేంద్రం చార్జీలు తగ్గించిందని.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం సెస్ తగ్గించలేదని అన్నారు. అన్ని రాష్ట్రాలు తగ్గించినా.. తెలంగాణ ప్రభుత్వం మాత్రం తగ్గించలేదని ఫైర్ అయ్యారు. హైదరాబాద్ నారాయణగూడలోని కేశవ మెమోరియల్ హై స్కూల్ లో అటల్ బిహారీ వాజ్పేయి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన‌ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సర్టిఫికెట్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రాంకు ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హాజరయ్యారు.

ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ప్రజల బాధలు తెలుసుకొని పెట్రోల్, డీజిల్ పై భారం తగ్గించిందని తెలిపారు. దేశంలోనే తెలంగాణ ప్రభుత్వం అత్యధికంగా పెట్రోల్, డీజిల్ పై పన్నులు వసూలు చేస్తోందని విమ‌ర్శించారు. కేసీఆర్ డిల్లీకి వెళ్లడం వల్లే పెట్రోల్, డీజిల్ తగ్గించారని ప్రచారం చేసుకుంటున్నారని.. కేసీఆర్ కుటుంబానికి చీదరింపు తప్పదని అన్నారు. రాష్ట్రంలో రైతులను ఆదుకోవాల్సింది పోయి.. వదిలేసి పంజాబ్ రైతులను కలుస్తున్నారని విమ‌ర్శించారు.

కేసీఆర్ అమెరికా అధ్యక్షుడిని కలిసినా, పాకిస్థాన్ అధ్యక్షుడిని కలిసినా మేము భయపడమ‌ని అన్నారు. కేంద్రం తీసుకొచ్చిన నూతన విద్యా విధానం నిరుపేదల కోసమేన‌ని.. కేసీఆర్ కు దీనిపై కనీస అవగాహన లేదని విమ‌ర్శించారు. కేసీఆర్ కేజీ టు పీజీ ఉచిత విద్య అన్నారు.. ఏమైందని.. మాకు కేసీఆర్ సర్టిఫికేట్ అక్కర్లేదని అన్నారు. గతంలో కూడా ఎన్నో సందర్భాల్లో దేశవ్యాప్తంగా సంచలనాలు సృష్టిస్తా అన్నారు.. కానీ అవన్నీ ప్రగతి భవన్ కే పరిమితం అయ్యాయి ఎద్దేవా చేశారు.

Next Story
Share it