ఎమ్మెల్సీ సురభి వాణి దేవిని నిరుద్యోగులు అడ్డుకున్నారు. ఉద్యోగాలపై ప్రభుత్వ వైఖరిని ప్రశ్నిస్తూ తమ ఓట్లతో గెలిచిన ఎమ్మెల్సీగా ఉద్యోగాలు కల్పించలేకపోతే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీలో నిర్వహించిన జాబ్ ఫెయిర్ లో నిరుద్యోగులు ఆందోళనకు దిగారు. దీంతో అక్కడికి పోలీసులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. సెంట్రల్ లైబ్రరీ వారి సౌజన్యంతో 50 ప్రైవేట్ కంపెనీలు ముందుకొచ్చాయి. ప్రారంభానికి హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల ఎమ్మెల్సీ సురభి వాణి దేవి విచ్చేశారు. ఈ సందర్భంగా నిరుద్యోగులు ఆందోళనకు దిగారు. నీళ్లు, నిధులు, నియామకాల మీద ఏర్పడ్డ తెలంగాణలో ఆత్మహత్యలు తప్ప ఉద్యోగాలు లేవని నిరుద్యోగులు ప్రశ్నింశారు.
కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఉద్యోగాలు ఇవ్వలేకపోతే.. తెలంగాణ ఎవరికోసం, ఎందుకోసం ఏర్పడిందో చెప్పాలని నిలదీశారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందు 50 వేల ఉద్యోగాలు ప్రకటించిన కేసీఆర్.. ఒక్క ఉద్యోగం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగాల విషయమై వాణి దేవి ముఖ్యమంత్రితో మాట్లాడుతానన్నారు. ఉద్యోగాలపై ముఖ్యమంత్రితో మాట్లాడకుంటే.. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు నిరుద్యోగులు. శాసనమండలిలో నిరుద్యోగుల తరపున మాట్లాడతానని అక్కడి వెళ్ళిపోయారు వాణి దేవి. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే ఉద్యోగులపై ప్రకటన చేయకుంటే.. జిల్లాలు, మండలాలు, రాష్ట్రస్థాయిలో నిరుద్యోగుల ఆందోళన చేపడతామని హెచ్చరించారు.