తెలంగాణ అమ్మాయిలను రూ.5 లక్షలకు బేరం..బట్టబయలైన అక్రమ పెళ్లిళ్ల రాకెట్
కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన ఇద్దరు గిరిజన మహిళల అదృశ్యం కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
By - Knakam Karthik |
తెలంగాణ అమ్మాయిలను రూ.5 లక్షలకు బేరం..బట్టబయలైన అక్రమ పెళ్లిళ్ల రాకెట్
కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన ఇద్దరు గిరిజన మహిళల అదృశ్యం కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆరు నెలల క్రితం మాయమైన ఈ యువతులను మధ్యప్రదేశ్‌లో గుర్తించిన పోలీసులు, వారు మానవ అక్రమ రవాణా ముఠా చేతిలో చిక్కి ఒక్కొక్కరు రూ. 2.5 లక్షలకు అమ్ముడుపోయినట్లు నిర్ధారించారు.
నమ్మించి మోసం..ఆపై అపహరణ:
బెజ్జూర్ పోలీసుల కథనం ప్రకారం.. బాధితులిద్దరూ మంచిర్యాలలోని ఒక షాపింగ్ మాల్‌లో పనిచేసేవారు. వీరిపై కన్నేసిన పొరుగునే ఉండే ప్రశాంత్, సవిత అనే దంపతులు పెళ్లి చేసుకుంటే భారీగా డబ్బులు ఇస్తామని ఆశ చూపారు. యువతుల కుటుంబ సభ్యులు ఈ ప్రతిపాదనను తిరస్కరించడంతో, నిందితులు అదును చూసి వారిని అపహరించి బలవంతంగా మధ్యప్రదేశ్‌కు తరలించారు. అక్కడ ఒక గుడిలో ఇద్దరు వ్యాపారవేత్తలకు ఇచ్చి బలవంతపు వివాహాలు జరిపించారు. ఈ క్రమంలో నిందితుడు ప్రశాంత్ తానే ఆ యువతులకు మేనమామను అని అబద్ధం చెప్పి, ఒక్కొక్కరిని రూ. 2.5 లక్షల చొప్పున మొత్తం రూ.5 లక్షలకు విక్రయించాడు.
పోలీసుల ఎంట్రీ..బయటపడ్డ నిజాలు:
తమ కుమార్తెలు కనిపించడం లేదని 65 ఏళ్ల వృద్ధురాలు ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు, సాంకేతిక పరిజ్ఞానంతో బాధితులు మధ్యప్రదేశ్‌లో ఉన్నట్లు గుర్తించారు. మార్చి 14న అక్కడికి వెళ్లిన పోలీసులు బాధితులను, వారిని పెళ్లి చేసుకున్న వ్యక్తులను బెజ్జూర్‌కు తీసుకువచ్చారు. బాధితుల్లో ఒకరు ప్రస్తుతం గర్భవతిగా ఉన్నట్లు సమాచారం. బ్రోకర్ల ద్వారా జరిగిన ఈ విక్రయ ఉదంతం విన్న పోలీసులు విస్తుపోయారు.
ముగ్గురి అరెస్ట్.. ఒకరు పరారీ:
ఈ దారుణానికి ఒడిగట్టిన ప్రశాంత్, సవితతో పాటు పెళ్లి బ్రోకర్ మహేష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. మరో నిందితుడు రాహుల్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. నిందితులపై కొత్త చట్టం (BNS) కింద సెక్షన్ 318(4) (మోసం), 143 (అక్రమ రవాణా) కింద కేసులు నమోదు చేశారు. అమాయక గిరిజన యువతులను లక్ష్యంగా చేసుకుని సాగుతున్న ఈ ముఠా వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు.