Telangana: ఇవాళ, రేపు స్కూళ్లు బంద్‌

భారీ వర్షాల దృష్ట్యా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలకు రెండు రోజుల పాటు సెలవులు ప్రకటించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

By అంజి  Published on  20 July 2023 9:31 AM IST
holidays, educational institutions, Telangana, heavy rains

Telangana: రేపు, ఎల్లుండి స్కూళ్లు బంద్‌

తెలంగాణలో భారీ వర్షాల కురుస్తున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ సర్కార్‌ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలకు రెండు రోజుల పాటు సెలవులు ప్రకటించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గురువారం, శుక్రవారం విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించినట్టు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. తిరిగి పాఠశాలలు శనివారం ప్రారంభమవుతాయని వెల్లడించారు. రాష్ట్ర సర్కార్‌ నిర్ణయంతో ఇప్పటికే స్కూళ్లకు వెళ్లిన విద్యార్థులు తిరిగి ఇళ్లకు చేరుకుంటున్నారు.

తెలంగాణలో గత నాలుగు రోజులు నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. దీంతో చెరువులు నిండుతుండగా.. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. హైదరాబాద్‌లో క్షణం గ్యాప్‌ లేకుండా వర్షం కురుస్తుండటంతో లోతట్టు ప్రాంతాలు, రోడ్లు జలమయం అయ్యాయి. ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడుతుండటంతో రాకపోకలకు ఇబ్బంది కలుగుతోంది. రాత్రి వీచిన ఈదురుగాలులకు పలు చోట్ల చెట్లు విరిగిపడ్డాయి. కొన్నిచోట్ల కరెంట్‌ సరఫరాకి అంతరాయం ఏర్పడింది.

బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా మరో 4 రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ వెల్లడించింది. ఇవాళ యాదాద్రి, సూర్యాపేట, సంగారెడ్డి, మెదక్‌, రంగారెడ్డి, హైదరాబాద్‌, వికారాబాద్‌, మహబూబాబాద్‌, వరంగల్‌, హనుమకొండ, జనగామ, భూపాలపల్లి, మేడ్చల్‌, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురువనున్నాయి. ఇక శుక్రవారం నిజామాబాద్‌, కామారెడ్డి తదితర జిల్లాల్లో శనివారం భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో భారీ వానలు కురుస్తాయని చెబుతున్నారు.

Next Story