కాంగ్రెస్ లో చేరిన తుమ్మల నాగేశ్వర రావు
మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు కాంగ్రెస్‌లో చేరారు. ఆయనకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు
By Medi Samrat Published on 16 Sept 2023 5:33 PM IST
మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు కాంగ్రెస్‌లో చేరారు. ఆయనకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే కండువా కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సహా ముఖ్య నేతలంతా పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీకి తుమ్మల ఈరోజు రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పంపించారు. 'తెలంగాణ రాష్ట్ర సమితిలో సహకరించినందుకు ధన్యవాదములు. పార్టీకి నా రాజీనామాను సమర్పిస్తున్నాను' అంటూ రాజీనామా లేఖలో తెలిపారు. ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించారు తుమ్మల. బీఆర్ఎస్ ప్రకటించిన 115 మంది అభ్యర్థుల లిస్టులో తుమ్మల నాగేశ్వర్ రావుకు టికెట్ ఇవ్వకుండా కందాల ఉపేందర్ రెడ్డికి ఇచ్చారు. అప్పటి నుంచి అసంతృప్తితో ఉన్న తుమ్మల తన నియోజకవర్గంలోని అనుచరులతో వరుస సమావేశాలు నిర్వహించారు. చర్చలన్నీ ముగిశాక తుమ్మల కాంగ్రెస్ లో చేరాలని నిర్ణయించుకున్నారు.
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు, ఆయన భార్య, మంచిర్యాల జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ భాగ్యలక్ష్మి కాంగ్రెస్ పార్టీలో చేరారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ప్రచార కమిటీ కో ఛైర్మన్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో వీరు కాంగ్రెస్ లో చేరారు. వీరితో పాటు వారి అనుచరులు కూడా పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ లో చేరారు.