టీటీడీపీ మాజీ అధ్యక్షుడు ఎల్ రమణ గులాబీ గూటికి చేరారు. టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో ఎల్. రమణ టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా రమణకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి కేటీఆర్ సాదరంగా ఆహ్వానించారు. కేటీఆర్ చేతుల మీదుగా ఎల్ రమణ.. టీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వం తీసుకున్నారు. ఈ సందర్భంగా రమణకు కేటీఆర్‌తో పాటు పలువురు నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్‌తో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన టీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
ఇదిలావుంటే.. రమణ టీఆర్ఎస్‌లో చేరబోతున్నట్టు గత కొన్ని రోజులుగా వార్తలు వచ్చాయి. మొదట ఈ వార్తలను ఖండించిన రమణ.. ఇటీవల ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ను కలిసిన తర్వాత.. పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. రాజీనామా లేఖను చంద్రబాబుకు పంపించారు. తన ఎదుగుదలకు 30 ఏళ్లుగా తోడ్పాటు అందించిన చంద్రబాబుకు అందులో హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.