హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు టీఎస్‌ఆర్టీసీ పేరును టీజీఎస్‌ఆర్టీసీగా మార్చడం జరిగిందని.. ఆ సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. ఈ మేరకు అధికారిక ఎక్స్ ఖాతాలైన @tgsrtcmdoffice, @tgsrtchq లను సంస్థ మార్చిందని తెలిపారు. విలువైన సలహాలు, సూచనలతో పాటు ఫిర్యాదులను మార్చిన ఈ ఖాతాల ద్వారా తమ దృష్టికి తీసుకురావాలని ప్రజలను సజ్జనార్ కోరారు. టీజీఎస్‌ఆర్టీసీ అందిస్తోన్న సేవల గురించి తెలుసుకునేందుకు @tgsrtcmdoffice, @tgsrtchq ఖాతాలను ఫాలో అవ్వాలని విజ్ఞప్తి చేశారు.
త్వరలో లోగోలో మార్పులు చేపట్టనున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఇక నుంచి బస్సులను టీజీ సిరీస్‌తో రిజిస్ట్రేషన్ చేయించనున్నట్లు అధికారులు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నాటి ప్రభుత్వం టీఎస్ఆర్టీసీగా పేరు మార్చింది. అయితే ఉద్యమం సమయంలో టీజీని తెలంగాణవాదులు, ప్రజలు ఉపయోగించారు. దీంతో కాంగ్రెస్ పార్టీ తాము అధికారంలోకి వచ్చాక టీఎస్‌ను టీజీగా మార్చుతామని ప్రకటించింది. రాష్ట్రంలో టీజీ అమలుకు కేంద్రం ఇటీవల గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వగా, అన్ని ప్రభుత్వ సంస్థల పేర్లలో 'టీఎస్'కు బదులు 'టీజీ'ని ఉపయోగించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.