కరీంనగర్‌ పట్టణంలో.. పెట్రోల్‌ బంక్‌ను తెరవనున్న టీఎస్‌ఆర్టీసీ.!

TSRTC to open petrol bunk in Karimnagar. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ.. కరీంనగర్ పట్టణంలోని ఆర్టీసీ వర్క్‌షాప్ సమీపంలో పెట్రోల్ బంక్‌ను ప్రారంభించాలని నిర్ణయించింది.

By అంజి  Published on  20 Dec 2021 9:15 PM IST
కరీంనగర్‌ పట్టణంలో.. పెట్రోల్‌ బంక్‌ను తెరవనున్న టీఎస్‌ఆర్టీసీ.!

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ.. కరీంనగర్ పట్టణంలోని ఆర్టీసీ వర్క్‌షాప్ సమీపంలో పెట్రోల్ బంక్‌ను ప్రారంభించాలని నిర్ణయించింది. ఇందుకోసం 50 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఆర్టీసీ వర్క్‌షాప్‌లో 10 వేల చదరపు అడుగుల స్థలాన్ని కేటాయించింది. భూమిని హిందుస్థాన్ పెట్రోలియం కంపెనీకి 30 ఏళ్ల పాటు లీజుకు ఇచ్చిన టీఎస్‌ఆర్‌టీసీ.. ప్రతిపాదిత స్థలంలో పెట్రోల్ బంక్ ఏర్పాటు చేసేందుకు హెచ్‌పీతో ఒప్పందం చేసుకుంది. ఆర్టీసీ డిస్పెన్సరీతో పాటు పెట్రోల్ బంక్ పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. 2022 మార్చి చివరి నాటికి బంక్ అందుబాటులోకి రానుంది.

తీవ్ర ఆర్థిక ఒత్తిడిలో కొట్టుమిట్టాడుతున్న తెలంగాణ ఆర్టీసీ సంస్థ.. ఆదాయాన్ని సమకూర్చుకునేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది. వాణిజ్య అవసరాల కోసం తన భూములను లీజుకు ఇవ్వడంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా వివిధ డిపోల్లోని తన భూముల్లో పెట్రోల్ బంకులను నడుపుతోంది. హైదరాబాద్‌లోని హన్మకొండ, జనగాం, మహబూబాబాద్, ఆసిఫాబాద్, బాన్సువాడ, కుషాయిగూడ, హకీంపేట తదితర డిపోల్లో బంకులను నిర్వహిస్తున్నారు.

కరీంనగర్ రీజియన్ రీజినల్ మేనేజర్ ఎ శ్రీధర్ మాట్లాడుతూ.. పెట్రోల్ బంక్ ఏర్పాటుకు భూమిని 30 ఏళ్ల పాటు హెచ్‌పీకి లీజుకు ఇచ్చామని తెలిపారు. బంక్, ఇతర వాటి నిర్వహణపై ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. పెద్దపల్లి, జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లిలో మరిన్ని పెట్రోలు బంక్‌లు ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలు కూడా వచ్చాయి. మల్టీప్లెక్స్, ఫంక్షన్ హాళ్లు, షోరూమ్‌లు, ఇతర వాణిజ్య భవనాల నిర్మాణం వంటి వాణిజ్య కార్యకలాపాల కోసం కార్పొరేషన్ భూములను లీజుకు ఇవ్వాలని కూడా ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు.

Next Story