గ్రామీణ, ప‌ట్ట‌ణ ప్ర‌యాణికుల కోసం టీఎస్ఆర్టీసీ ‘టీ-9 టికెట్’

TSRTC 'T-9 Ticket' for Rural and Urban Passengers. గ్రామీణ, ప‌ట్ట‌ణ ప్రయాణికులకు ఆర్థికభారం తగ్గించేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్‌ఆర్టీసీ)

By Medi Samrat  Published on  16 Jun 2023 9:21 AM GMT
గ్రామీణ, ప‌ట్ట‌ణ ప్ర‌యాణికుల కోసం టీఎస్ఆర్టీసీ ‘టీ-9 టికెట్’

గ్రామీణ, ప‌ట్ట‌ణ ప్రయాణికులకు ఆర్థికభారం తగ్గించేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్‌ఆర్టీసీ) కీలక నిర్ణయం తీసుకుంది. పల్లె వెలుగు బస్సులో ప్రయాణించే మహిళలు, సీనియర్ సిటిజన్ల కోసం ‘టి-9 టికెట్’ అందుబాటులోకి తెచ్చింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో టి-24, టి-6, ఎఫ్-24 టికెట్లను ఇప్పటికే అందిస్తోన్న సంస్థ.. తొలిసారిగా గ్రామీణ, ప‌ట్ట‌ణ ప్రయాణికుల సౌకర్యార్థం టి-9 టికెట్ ను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది.

హైదరాబాద్ లోని బస్ భవన్ లో శుక్ర‌వారం ‘టి-9 టికెట్’ పోస్టర్ ను టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ ఆవిష్కరించారు. ఈ టికెట్ ఈ నెల 18(ఆదివారం) నుంచి పల్లె వెలుగు బస్సుల్లో కండక్టర్ల వద్ద అందుబాటులో ఉంటాయని ఆయన తెలిపారు.

‘టి-9 టికెట్’ పల్లె వెలుగు బస్సుల్లో ప్రయాణించే మహిళలు, సీనియర్ సిటిజన్స్ కు వర్తిస్తుంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే ఈ టికెట్ చెల్లుబాటు అవుతుంది. ఈ టికెట్ ద్వారా 60 కిలోమీటర్ల పరిధిలో ఒక్కసారి రానూపోను ప్రయాణం చెయొచ్చు. ‘టి-9 టికెట్’ కు రూ.100 ధరగా టీఎస్ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. టోల్ గేట్ చార్జీల‌పైన మిన‌హాయింపు ఇచ్చింది. దీంతో ఈ టికెట్ ద్వారా ఒక్కోక్కరికి రూ.20 నుంచి రూ.40 వ‌ర‌కు ఆదా అవుతంద‌ని సంస్థ ప్ర‌క‌టించింది.

60 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లు వయసు ధృవీకరణ కోసం తమ ఆధార్ కార్డును కండక్టర్లకు చూపించి టి-9 టికెట్ పొందవచ్చు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే ఈ టికెట్లను కండక్టర్లు ఇస్తారు. తెలంగాణ రాష్ట్ర పరిధిలోనే ఈ టికెట్ చెల్లుబాటు అవుతుంది.

పల్లె వెలుగు బ‌స్సుల్లో ప్రతి రోజు సగటున 15 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. అందులో మహిళలు, సీనియర్ సిటిజన్లు ఎక్కువగా ఉన్నారు. వారికి ఆర్థికభారం తగ్గించాలనే ఉద్దేశంతోనే పల్లెవెలుగు బస్సుల్లో ‘టి-9 టికెట్’కు టీఎస్ఆర్టీసీ యాజమాన్యం శ్రీకారం చుట్టింది. ఈ టికెట్ తో రూ.100 చెల్లించి 60 కిలోమీటర్ల పరిధిలో రానూపోను ప్రయాణించవచ్చు. గ్రామీణ, ప‌ట్ట‌ణ ప్రయాణికులు ఈ సదుపాయాన్ని వినియోగించుకుని సంస్థను ఆదరించాలని టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ కోరారు.


Next Story