ప్రయాణికుల సౌకర్యార్థం కొత్తగా టీఎస్ఆర్టీసీ 'పల్లె వెలుగు టౌన్ బస్ పాస్'
TSRTC 'Pallevelugu Town Bus Pass' for the convenience of passengers. ప్రయాణికుల ఆర్ధిక భారం తగ్గించేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) కీలక నిర్ణయం తీసుకుంది
By Medi Samrat Published on 17 July 2023 4:26 PM ISTప్రయాణికుల ఆర్ధిక భారం తగ్గించేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా “పల్లెవెలుగు టౌన్ బస్ పాస్”కు శ్రీకారం చుట్టింది. మొదటగా కరీంనగర్, మహబూబ్ నగర్, నిజామాబాద్, నల్లగొండ జిల్లా కేంద్రాల్లో తిరిగే పల్లె వెలుగు బస్సుల్లో ఈ పాస్ ను అమలు చేయాలని సంస్థ నిర్ణయించింది.
ఈ టౌన్ పాస్ తో ప్రయాణికులు కరీంనగర్, మహబూబ్ నగర్ లో 10 కిలో మీటర్లు, నిజామాబాద్, నల్లగొండలో 5 కిలోమీటర్ల పరిధిలో అపరిమిత ప్రయాణం చేయొచ్చు. 10 కిలోమీటర్ల పరిధికి నెలకు రూ.800, 5 కిలోమీటర్ల పరిధికి రూ.500గా “పల్లె వెలుగు టౌన్ బస్ పాస్” ధరను సంస్థ ఖరారు చేసింది. ఇప్పటికే హైదరాబాద్, వరంగల్ లో జనరల్ బస్ పాస్ అందుబాటులో ఉంది. ఆ బస్ పాస్ ను జిల్లా కేంద్రాల్లోనూ అమలు చేయాలని ప్రయాణికుల నుంచి వచ్చిన అభ్యర్థనల మేరకు కొత్తగా “పల్లెవెలుగు టౌన్ బస్ పాస్”ను సంస్థ తెచ్చింది.
హైదరాబాద్ లోని బస్ భవన్‌లో సోమవారం "పల్లె వెలుగు టౌన్ బస్ పాస్" పోస్టర్లను సంస్థ ఉన్నతాధికారులతో కలిసి టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ ఆవిష్కరించారు. ఈ కొత్త టౌన్ పాస్ ఈ నెల 18 (మంగళవారం) నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి వస్తుందని ఆయన తెలిపారు.
“జిల్లా కేంద్రాల్లో ఉద్యోగులు, చిరువ్యాపారులు ఎక్కువగా రాకపోకలు సాగిస్తుంటారు. వారి ఆర్థిక భారం తగ్గించేందుకు “పల్లె వెలుగు టౌన్ బస్ పాస్” ను టీఎస్ఆర్టీసీ యాజమాన్యం అందుబాటులోకి తీసుకువచ్చింది. మొదటగా కరీంనగర్, మహబూబ్ నగర్, నిజామాబాద్, నల్లగొండ జిల్లా కేంద్రాల్లో ఈ పాస్ ను అమలు చేస్తున్నాం. ప్రయాణికుల ఫీడ్ బ్యాక్ ను బట్టి మరిన్ని ప్రాంతాలకు పల్లె వెలుగు టౌన్ బస్ పాస్ ను విస్తరిస్తాం. వాస్తవానికి 10 కిలోమీటర్ల పరిధికి రూ.1200, 5 కిలోమీటర్ల పరిధికి రూ.800 ధర ఉండగా.. ప్రయాణికులకు ఆర్థిక భారం తగ్గించాలని ఆ బస్ పాస్ లకు సంస్థ రాయితీ కల్పించింది. 10 కిలోమీటర్ల పరిధికి రూ.800, 5 కిలో మీటర్ల పరిధికి రూ.500గా పాస్ ధరను నిర్ణయించింది. కొత్తగా తీసుకువచ్చిన ఈ పాస్ ను హైదరాబాద్, వరంగల్ లో మాదిరిగానే ప్రయాణికులు ఆదరించి.. సంస్థను ప్రోత్సహించాలి.” అని టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ కోరారు. ఈ బస్ పాస్ కు సంబంధించిన పూర్తి వివరాలకు టీఎస్‌ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్లు 040-69440000, 040-23450033ను సంప్రదించాలని ఆయన సూచించారు.