డ్రైవర్‌ ఆత్మహత్యపై వచ్చిన వార్తలు అవాస్తవం - టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌

TSRTC MD gave a rejoinder about one RTC driver who died by suicide. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని డిపో డ్రైవర్‌ జి. రాజయ్య ఆత్మహత్యకు డ్యూటీ మార్పు చేయకపోవడమే

By Medi Samrat  Published on  27 Nov 2022 9:14 AM GMT
డ్రైవర్‌ ఆత్మహత్యపై వచ్చిన వార్తలు అవాస్తవం - టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌

పెద్దపల్లి జిల్లా గోదావరిఖని డిపో డ్రైవర్‌ జి. రాజయ్య ఆత్మహత్యకు డ్యూటీ మార్పు చేయకపోవడమే కారణమని వస్తోన్న వార్తలు పూర్తి అవాస్తవమ‌ని టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ పేర్కొన్నారు. ఈ మేర‌కు ఓ ప్ర‌క‌టన విడుద‌ల చేశారు. వార్తలను ఖండించిన సజ్జనార్.. మృతుడు రాజయ్య స్వీయ అభ్యర్థన మేరకే మూడు నెలల క్రితం జేబీఎస్‌కు బదిలీ చేయడం జరిగిందని తెలిపారు. కొడుకు హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్నాడని, తన కుటుంబం అక్కడే ఉంటోందని, జేబీఎస్‌కు బదిలీ చేయాలని ఆయనే అభ్యర్థించారని పేర్కొన్నారు.

జేబీఎస్‌ డ్యూటీని మార్పు చేయమని అధికారులను రాజయ్య ఎప్పుడూ అడగలేదని స్ప‌ష్టం చేశారు. రాజ‌య్య‌ కూతురు గత రెండేళ్లుగా ఆస్ట్రేలియాలో ఉంటున్నారని.. ఆమె ఇటీవల హైదరాబాద్‌కు వచ్చి 6వ తేదీన‌ ఆస్ట్రేలియాకు తిరిగి వెళ్లాల్సి ఉండ‌గా.. అందుకు రాజయ్య ఆలయ సందర్శనలకు ఒక వారం సెలవు కోసం దరఖాస్తు చేసుకోగా.. మంజూరు చేయడం కూడా జరిగిందని తెలిపారు. రాజ‌య్య‌ చివరగా 23వ తేదీన విధులు నిర్వర్తించారని వెల్ల‌డించారు.

గోదావరి ఖని లోని తన స్వగృహంలో వ్యక్తిగత కారణాలతోనే రాజయ్య ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆత్మహత్య విషయం తెలియగానే గోదావరిఖని డిపో మేనేజర్‌, మృతుడు రాజయ్య ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారని తెలిపారు. అంత్యక్రియల నిమిత్తం టీఎస్‌ఆర్టీసీ తరుపున స్వయంగా రూ.20 వేలను కుటుంబసభ్యులకు అందజేశారని ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు.

రాజయ్య ఆత్మహత్యకు డ్యూటీ మార్పు కారణమని కుటుంబ సభ్యులు నుంచి ఎలాంటి ప్రస్తావన రాలేదని.. డ్యూటీ మార్పు కోసం గోదావరి ఖని డిపోలో ఆయన ఎవరినీ సంప్రదించలేదని ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరపాలని, వాస్తవాలను తెలియజేయాలని పోలీస్‌ యంత్రాంగాన్ని కోరిన‌ట్లు తెలిపారు.

డ్యూటీ మార్పు చేయలేదనే కారణంతో రాజయ్య ఆత్మహత్య చేసుకున్నట్లు వస్తోన్న వార్తలు పూర్తిగా నిరాధారమైనవి, అవాస్తవమైనవిగా ఖండించారు. టీఎస్‌ఆర్టీసీ సిబ్బంది సంక్షేమానికి సంస్థ నిబద్ధతతో కట్టుబడి ఉందని.. సంక్షేమం కోసం పెద్ద ఎత్తున అనేక కార్యక్రమాలను చేపడుతోందని తెలిపారు. సంస్థ ప్రతిష్ఠకు భంగం కలిగించే ఏకపక్ష వార్తలను ప్రచురించడం సరి కాదని సూచించారు. ఇలాంటి వార్తలు ప్రచురించే ముందు సంబంధిత అధికారుల వివరణ తీసుకోవాలని మీడియా సంస్థల ప్రతినిధులను కోరారు.


Next Story