ఆర్టీసీ ఛార్జీల పెంపు ప్రతిపాదనలు సీఎం కేసీఆర్ కి పంపించాం : మంత్రి

TSRTC Hikes Bus Ticket Prices. ఆర్టీసీ ఛార్జీల పెంపు ప్రతిపాదనలు సీఎం కేసీఆర్ కి పంపించామ‌ని మంత్రి పువ్వాడ అజ‌య్ కుమార్

By Medi Samrat  Published on  1 Dec 2021 3:32 PM IST
ఆర్టీసీ ఛార్జీల పెంపు ప్రతిపాదనలు సీఎం కేసీఆర్ కి పంపించాం : మంత్రి

ఆర్టీసీ ఛార్జీల పెంపు ప్రతిపాదనలు సీఎం కేసీఆర్ కి పంపించామ‌ని మంత్రి పువ్వాడ అజ‌య్ కుమార్ అన్నారు. రాష్ట్ర ర‌వాణా శాఖ‌పై మంత్రి పువ్వాడ అజ‌య్ కుమార్ బుధ‌వారం స‌మీక్ష నిర్వ‌హించారు. ఆర్టీసీ చైర్మ‌న్ బాజిరెడ్డి గోవ‌ర్ధ‌న్‌, ఎండీ వీసీ స‌జ్జ‌నార్‌, ఈడీల‌తో అజ‌య్ కుమార్ సమీక్షించారు. ప్ర‌ధానంగా ఆర్టీసీ ఛార్జీల పెంపుపై చర్చించారు. ఛార్జీల పెంపు ప్ర‌తిపాద‌న‌ను గ‌త నెల‌లోనే సీఎం కేసీఆర్‌కు నివేదించామ‌ని చైర్మ‌న్ బాజిరెడ్డి గోవ‌ర్ధ‌న్ తెలిపారు. ఆర్డిన‌రీ బ‌స్సుల్లో కిలోమీట‌ర్‌కు 25 పైస‌లు, ఇత‌ర బ‌స్సుల్లో కిలోమీట‌ర్‌కు 30 పైస‌లు పెంచాల‌ని ప్ర‌తిపాదించామ‌ని ఆయ‌న పేర్కొన్నారు. ఆర్టీసీ రోజుకు 6.8 లక్షల లీటర్ల డీజిల్ వినియోగిస్తోందని చెప్పిన మంత్రి, చైర్మన్.. డీజిల్ ధరల పెరుగుదల ఆర్టీసీకి భారంగా మారిందని తెలిపారు.

కేంద్ర విధానాల వల్లే ఆర్టీసీ ఛార్జీల పెంచాల్సి వస్తోందని చెప్పారు. ఛార్జీల పెంపును ప్రజలు అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. బస్సు ఛార్జీలు పెరిగితే.. ప్రస్తుతం కిలోమీటరుకు కనీస ఛార్జీ 10 నుంచి గరిష్ఠంగా 35 రూపాయల వరకు ఉంది. పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ, సిటీ సబర్బన్, మెట్రో ఎక్స్​ప్రెస్ బస్సులకు కిలోమీటర్‌కు 10 రూపాయల చొప్పున.. మెట్రో డీలక్స్, ఎక్స్‌ప్రెస్ బస్సులకు 15 రూపాయల చొప్పున వసూలు చేస్తున్నారు. డీలక్స్ బస్సులకు 20 రూపాయలు, సూపర్ లగ్జరీ బస్సులకు 25, రాజధాని ఏసీ బస్సులకు 35, గరుడ ప్లస్ ఏసీ బస్సులకు కిలోమీటర్‌కు 35 రూపాయలు వసూలు చేస్తున్నారు. బస్సు ఛార్జీలు పెరిగితే.. ఇప్పుడున్న నష్టాల్లో కొంతమేరకైనా తగ్గే అవకాశాలున్నాయని ఆర్టీసీ యాజమాన్యం అంచనా వేస్తోంది.

ఆర్టీసీకి రూ.4,260 కోట్ల నష్టాలు..గడిచిన మూడేళ్లలో ఆర్టీసీ ఆదాయానికి, ఖర్చుకు మధ్య అంతరం భారీగా పెరిగిపోయింది. ఈ మూడేళ్లలోనే ఆర్టీసీకి రూ.4,260 కోట్ల నష్టాలు వచ్చాయి. కరోనా లాక్‌డౌన్‌తో, పెరిగిన డీజిల్ ధరలతో నష్టాలు వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. పెరుగుతున్న నష్టాలను తగ్గించుకోవాలంటే టిక్కెట్ ధరలు పెంచడం తప్ప మరో మార్గం లేదని ఆర్టీసీ యాజమాన్యం అభిప్రాయపడుతుంది.

2018-19 మార్చి నాటికి ఆర్టీసీ ఆదాయం రూ.4,882 కోట్లు కాగా, ఖర్చు రూ.5,811 కోట్లకు చేరుకుంది. నష్టం రూ.929 కోట్లు.

2019-20 మార్చి నాటికి ఆదాయం రూ.4,592 కోట్లు, ఖర్చు 5,594 కోట్లు. నష్టం రూ.1,002 కోట్లు.

2020-21 మార్చి నాటికి ఆర్టీసీ ఆదాయం 2,455 కోట్లు, ఖర్చు రూ.4,784 కోట్లకు చేరుకుంది. నష్టం రూ.2,329 కోట్లు.


Next Story